ఏపీ సీఎం జగన్ కు హైకోర్టు రెండు షాక్ లు ఒకేసారి ఇచ్చింది. అమరావతి రైతుల విషయంలో, జర్నలిస్టు అంకబాబు అరెస్టు విషయంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రకు పోటీగా ఇతరుల నిరసనలకు, ఆటంకాలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల కాలలంలో పాదయాత్రను అడ్డుకునేందుకు కొందరు వైసీపీ నేతలు యాత్రను భగ్నం చేసేందుకు కుట్ర పన్నుతున్న సంగతి తెలిసిందే.
ఇలా పాదయాత్రను అడ్డుకోవాలని ఉద్రిక్తతలు జరుగుతున్న నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో తామిచ్చిన ఆదేశాలకు లోబడే పాదయాత్ర చేయాలని, 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశించింది. రోడ్డు పక్కన నిలబడి పాదయాత్రకు సంఘీభావం తెలపాలని, పాదయాత్రలో 4 వాహనాలను మాత్రమే వినియోగించాలని తెలిపింది. కోర్టు అనుమతించిన వారు తప్ప ఇతరులు పాదయాత్రలో పాల్గొనకూడదని తేల్చి చెప్పింది.
కాగా, సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టును ఫార్వార్డ్ చేశారన్న ఆరోపణలపై సీనియర్ జర్నలిస్టు అంకబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంకబాబు అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి బెయిల్ పొందిన అంకబాబు తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది.
అంకబాబుపై తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ సీఐడీ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది.