ఏపీ సర్కారుపై హైకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రూల్ ఆఫ్ లా ఉల్లంఘన, న్యాయమూర్తులపై కామెంట్లు చేసిన కేసు విషయంలోనే జరగడంతో కోర్టు ఆగ్రహించింది. ఇటీవలి కాలంలో ఏ కోర్టు స్పందించనంత తీవ్రంగా జగన్ సర్కారుపై ఏపీ హైకోర్టు స్పందించింది.
మీకు న్యాయవ్యవస్థపై గౌరవం లేదు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదు. డీజీపీకి పిలిచి చెప్పినా ఆయన ఆధ్వర్యంలోనే ఉల్లంఘన జరుగుతోంది. పైగా స్వయంగా న్యాయవ్యవస్థ ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థలపై విచ్చలవిడిగా విమర్శలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూడో స్తంభం అయిన న్యాయవ్యవస్థను కనుక నిర్లక్ష్యం చేస్తే, రూల్ ఆఫ్ లా అమలు కాకపోతే అది సమాజంలో అసహనం పెంచుతుంది. సివిల్ వార్ కి దారి తీసే పరిస్థితి వస్తుంది అని హెచ్చరించింది.
ఇకపై రూల్ ఆఫ్ లా విషయంలో మరోసారి కనుక నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తాం అంటూ జగన్ సర్కారుపై ఏపీ హైకోర్టు తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసింది.
న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడాన్ని సహించబోం. న్యాయమూర్తులపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అరెస్టుకు విచారణకు ఆదేశాలు ఇస్తే నోటీసులు తీసుకోవడానికి దొరకడం లేదని చెబుతున్నారు. 90 మందిపై కోర్టు నోటీసుల కేసులో నిందితులు దొరకలేదనడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.
విచ్చలవిడిగా మీడియాలో కనిపిస్తున్న వారు దొరక్కపోవడం ఏంటని కోర్టు నిలదీసింది. దీనిపై సీఐడీ దాఖలు చేసిన అఫిడవిట్ పై విచారణను 6వ తేదీకి వాయిదా వేస్తూ జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవిలతో కూడా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యాయవ్యవస్థపై కించపరిచే కామెంట్లు చేసిన వారిపై ఏపీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ స్వయంగా హైకోర్టులో పిటిషను వేశారు. దీనిపై విచారణకు సీఐడీ వేసిన అఫిడవిట్ లోని అంశాలు న్యాయమూర్తుల ఆగ్రహానికి కారణం అయ్యారు.
హాస్యాస్పదమైన కారణాలతో అఫిడవిట్ దాఖలు చేశారని… మీకు న్యాయవ్యవస్థ వద్దనుకుంటే పార్లమెంటుకు వెళ్లి ఏపీ హైకోర్టును తీసేయమని కోరండి అని తీవ్ర స్వరంతో సూచించింది.ఇందులో సామాజిక మాధ్యమాల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సజ్జన్ పూవయ్య, ముకుల్ రోహ్తిగీ హాజరయ్యారు. ఆయా సంస్థల తరఫున వారు కౌంటర్లు దాఖలు చేసి వాదనలు వినిపించారు.