అమరావతి రాజధాని భూముల్లో టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నాయకులు నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే. అసలు అక్కడ ఇన్ సైర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ హైకోర్టు చెప్పడంతో వైసీపీ నేతలు…అసైన్డ్ భూముల్లో అవకతవకలంటూ చంద్రబాబుపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. అయితే, కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో ఎస్సీ, ఎస్టీ కేసంటూ వైసీపీ నేతలు నానా హంగామా చేశారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది.
ఇక, అమరావతి భూముల విషయంలో ఏ పాచిక పారకపోవడంతో చివరకు అసైన్డ్ భూముల రైతులకు ఇచ్చిన ప్లాట్లు వెనక్కి తీసుకుంటూ జగన్ సర్కార్ జీవో-316 జారీ చేసింది. అయితే, ఈ వ్యవహారంపై కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారంపై నేడు విచారణ జరిపిన హైకోర్టు జోవో-316పై తదనంతర చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వారికి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ భూములను తిరిగి తీసుకోవద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో, రాజధాని అమరావతి భూముల విషయంలో జగన్ కు హైకోర్టు మరో షాక్ ఇచ్చినట్లయింది.
అమరావతి కోసం భూములను ఇచ్చిన రైతులకు జీవో 41 ద్వారా గత ప్రభుత్వం ప్యాకేజీ తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు దానిని రద్దు చేసి జీవో నంబర్-316 ద్వారా రైతులకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటున్నారని రైతుల తరఫు న్యాయవాది వాదనలు వివరించారు. ఆ జీవోపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, రైతుల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు…తదుపరి చర్యలను నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.