సీఎం జగన్ పాలనలో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ కు తెగబడుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లాలోని గడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆ మైనింగ్ వెనుక ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించడానికి వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం, వారిపై కేసు పెట్టాల్సిన పోలీసులు ఉమపైనే కేసు పెట్టడం సంచలనం రేపింది.
ఇంత జరిగినా సరే, వైసీపీ నేతలు మాత్రం అక్రమ మైనింగ్ ఆపడం లేదు. ఈ క్రమంలోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. వంశీ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరిపింది.
ఈ క్రమంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు…తాజాగా వంశీకి నోటీసులు జారీ చేసింది. వంశీతోపాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, గనుల శాఖ అధికారులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాుద, ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీ బ్రహ్మయ్య లింగేశ్వర స్వామి దేవాలయం, బ్రహ్మ లింగయ్య చెరువు పరిసరాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి.
అంతేకాదు, అక్కడ నుంచి చిన్న తరహా ఖనిజాలు వెలికితీస్తున్నారని హైకోర్టులో గన్నవరానికి చెందిన మాజీ సైనికుడు రవికుమార్ పిటిషన్ దాఖలు చేశారు. గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరారు. వల్లభనేని వంశీ ఆదేశాల ప్రకారమే వ్యాపారులు లక్ష్మణరావు, గొల్లపల్లి మోహన్ రంగారావు, కె శేషు కుమార్ లు అక్రమమైనింగ్ కు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. వారి నుంచి జరిమానా, సీవరేజి వసూలు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
Comments 1