ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు రాజధాని అమరావతికి మద్దతు పలికిన సీఎం జగన్…అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు రాజధానిని తరలించొద్దంటూ దాదాపు 400 రోజులుగా ఉద్యమం చేస్తున్నా పట్టించుకోని జగన్….రాజధాని తరలింపుపై మాత్రం వడివడిగా అడుగులు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు, మూడు రాజధానుల విషయంలో జగన్ అడుగులకు కేంద్రం మడుగులు ఒత్తేలా వ్యవహరిస్తోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 3 రాజధానుల వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశమంటూ చేతులెత్తేసిన కేంద్రం….తాజాగా హైకోర్టు తరలింపు వ్యవహారం కూడా తమ పరిధిలోది కాదంటూ చేతులు దులుపుకుందన్న భావన వ్యక్తమవుతోంది. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం నేపథ్యంలో హైకోర్టు తరలింపుపై కేంద్రం జోక్యం చేసుకోదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజ్యసభ సమావేశాల సందర్భంగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ను ఉద్దేశించి జీవీఎల్ నరసింహారావు కొన్ని ప్రశ్నలడిగారు. ఈ ప్రశ్నలకు రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. కర్నూలుకు హైకోర్టు తరలించడంపై గత ఫిబ్రవరిలో ప్రతిపాదనలు వచ్చాయన్న రవిశంకర్, ఇతర నగరాల్లో హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటుపై ప్రతిపాదనలు రాలేదన్నారు. హైకోర్టు తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం సంబంధిత హైకోర్టును సంప్రదించి తీసుకుంటుందన్నారు. హైకోర్టు నిర్వహణ ఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదని, హైకోర్టును కర్నూలుకు తరలించడడంపై ప్రభుత్వం, హైకోర్టు తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలని తెలిపారు. దీనికి, నిర్ణీత సమయాన్ని నిర్దేశించలేదని, ఈ అంశం హైకోర్టు విచారణలో ఉందని పేర్కొన్నారు. కేంద్రం స్పందనను బట్టి హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావలసి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ విషయంలో తాము చేసేదేం లేదంటూ కేంద్రం చేతులెత్తేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.