శిరోముండనం బాధితుడు వర ప్రసాద్ మిస్సింగ్
ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలతోపాటు..తమ మాట వినని సామాన్యులపైనా వైసీపీ నేతలు బెదిరింపులు, దాడులకు తెగబడున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, శాంతి భద్రతలు కరువయ్యాయని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు విమర్శించారు. ఈ క్రమంలోనే రాజమండ్రిలో వరప్రసాద్ అనే యువకుడికి పోలీసులు శిరోముండనం చేశారన్న ఆరోపణలు గత ఏడాది కలకలం రేపిన సంగతి తెలిసిందే. వర ప్రసాద్ పై వైసీపీ నేతలు దాడి చేశారని....ఆ తర్వాత వరప్రసాద్ ను పోలీసులు చిత్ర హింసలు పెట్టి...ఆ తర్వాత శిరోముండనం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా శిరోముండనం బాధితుడు వరప్రసాద్ అదృశ్యమయ్యాడన్న వార్త కలకలం రేపుతోంది.
తన భర్త వరప్రసాద్ కనిపించడం లేదంటూ సీతానగరం పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ భార్య కౌసల్య ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి వర ప్రసాద్ కనిపించడం లేదని వరప్రసాద్ వదిన తెలిపారు. సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి బాధపడుతూ ఉన్నాడని, ఏడుస్తున్నాడని తెలిపింది. అన్నం పెట్టాలని తన భార్యను అడిగాడని, అన్నం తింటున్న సమయంలో తనకు ఇదే చివరి ముద్ద అని, ఎక్కడకు వెళ్లినా అవమానాలే జరుగుతున్నాయని భార్యతో వరప్రసాద్ చెప్పాడని అతడి వదిన తెలిపారు.దీంతో మరోసారి వరప్రసాద్ శిరోముండనం ఘటనపై చర్చ మొదలైంది. వర ప్రసాద్ కనిపించకపోవడం వెనుక గల కారణాలేమిటన్నది తేలాల్సి ఉంది. కాగా, గత ఏడాది తనను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత చిత్రహింసలకు గురిచేశారని, బెల్ట్‌తో కొట్టారని బాధితుడు వరప్రసాద్ వాపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనకు శిరోముండనం చేశారని వరప్రసాద్ కన్నీటిపర్యంతమయ్యాడు. శిరోముండనం కేసులో తనకు న్యాయం జరగట్లేదని, నక్సలైట్లలో చేరడానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ కూడా రాశాడు. ఈ నేపథ్యంలోనే తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో వరప్రసాద్ నక్సలైట్లలో చేరాడా లేక పోలీసులపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కనిపించకుండా పోయాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.