ఈ మధ్యన సినిమా థియేటర్ల మీద ఏపీ అధికారులు పడటం.. పలు థియేటర్లు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నట్లుగా పేర్కొంటూ సినిమా థియేటర్లను సీజ్ చేయటం తెలిసిందే. అలా మూసేసిన థియేటర్లలో ఒకటి శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్ ను స్థానిక తహసీల్దార్ మూసివేశారు.
ఈ వ్యవహారంపై థియేటర్ యజమాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమ థియేటర్ ను మూసివేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై థియేటర్ యజమాని సవాలు విసిరారు. ఈ అంశంపై హైకోర్టులో తాజాగా విచారణ సాగింది.
ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ స్పందిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా సినిమా థియేటర్ ను నిర్వహిస్తున్నారంటూ ఒక తాహసీల్దార్ తాళం వేసి జప్తు చేయటాన్ని తప్పు పట్టారు.
ఆ అధికారం తహసీల్దార్ కు లేదని స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న సంయుక్త కలెక్టర్ తహసీల్దార్ కు అధికారం ఇవ్వలేదని గుర్తు చేసింది. అంతేకాదు.. థియేటర్ ను తెరవాలన్న ఆదేశాల్ని జారీ చేసింది.
ఈ అంశంపై ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దారు వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది వినిపించిన వాదనల్ని హైకోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చారు. థియేటర్ కు వేసిన తాళాన్ని తీయాలని తహసీల్దార్ ను ఆదేశించారు.
లైసెన్సు పునరుద్ధరణ వ్యవహారం అధికారుల వద్ద ఉన్న నేపథ్యంలో థియేటర్ లో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని పేర్కొన్నారు. అత్యుత్సాహంతో థియేటర్లను మూసే ప్రక్రియను ఉద్యమ స్ఫూర్తి మాదిరి వ్యవహరించే అధికారులకు ఈ ఆదేశాలు ఇబ్బందికి గురి చేయటం ఖాయమని చెప్పక తప్పదు.