ఏపీలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జరిగిన రెండు విడతల పోలింగ్ లో గెలుపు కోసం అధికార, ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులు హోరాహోరీగా తలపుడతున్నారు. అయితే, గెలుపు కోసం అధికార పార్టీ బెదిరింపులకు దిగుతోందని, పోలింగ్, కౌంటింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ గు సంబంధించి ఏపీ హైకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది.
పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను కచ్చితంగా వీడియో తీయాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలన్న పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రకంగా ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ ప్రక్రియను వీడియో తీయాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటింగ్ నిష్పక్షపాతంగా జరపాలని, పంచాయతీలోని ఓటర్ వీడియో షూట్ చేయాలని కోరితే వెంటనే కౌంటింగ్ ను వీడియో తీయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ అందుబాటులో లేదంటూ సాకులు చెప్పొద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
అంతకుముందు, రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేషన్ డోర్ డెలివరీ వాహనాల రంగులను మార్చాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 15కి వాయిదా వేసింది. అంతవరకు తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో రేషన్ డోర్ డెలివరీకి పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది. అయితే, కోడ్ కారణంగా ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనేందుకు మాత్రం వీలుండదు.