సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీలో జరుగుతున్న పలు పథకాలు, కార్యక్రమాలపై విపక్ష నేతలు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. విపక్షాలు, కొందరు వ్యక్తులు వేసిన పిల్ ల విచారణ అనంతరం…మెజారిటీ వాటిలో తీర్పులు జగన్ సర్కార్ కు వ్యతిరేకంగానే వచ్చాయి. ఎందుకంటే, జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పిల్ వేసిన వారికి స్పష్టత ఉంది కాబట్టి.
అయితే, ఈ విషయాన్ని విస్మరించిన వైసీపీ నేతలు, కొందరు వైసీపీ సానుభూతిపరులు, మద్దతుదారులు అవకాశం దొరికితే చాలు చంద్రబాబు, టీడీపీ నేతలను కోర్టులకు ఈడుద్దామన్న కాన్సెప్ట్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టో విడుదలపై ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో, మేనిఫెస్టోను వెనక్కు తీసుకోవాలని టీడీపీకి ఎస్ఈసీ సూచించింది. ఎస్ఈసీ సూచనతో ఆ మేనిఫెస్టోను టీడీపీ ఉపసంహరించుకుంది.
అయితే, ఇంతటి ఈ వ్యవహారం సద్దుమణగకుండా తాజాగా…ఈ మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని, టీడీపీ మేనిఫెస్టో ఉపసంహరించుకుందని కానీ, చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదని కె.శివరాజశేఖరరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ కు చురకలంటించింది. దీంతో, చంద్రబాబుకు ఏం సంబంధం అని కోర్టు ప్రశ్నించింది.
టీడీపీ ప్రధాన కార్యదర్శి మేనిఫెస్టో విడుదల చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలు కోరడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంలో చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అసలు ఈ పిల్కు విచారణార్హత లేదంటూ జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఇదండీ సంగతి….ప్రతిపక్ష నేత చంద్రబాబు పిల్లో లాగా మెత్తగా ఉంటున్నారు కదా అని కోర్టులో ఎలా పడితే అలా పిల్ లు వేస్తే కోర్టు మొట్టికాయలు వేయకుండా ఉంటుందా మరి. ఈ విషయాన్ని వైసీపీ నేతలు, పిల్ లు వేసే వారు గుర్తుంచుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.