ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలుమార్లు ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీం కోర్టులలో చుక్కెదురైన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడం మొదలు….ఇటీవల పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దు వరకు అనేక మార్లు ప్రభుత్వానికి న్యాయస్థానాల నుంచి చీవాట్లు పడ్డాయి. అయినప్పటికీ, జగన్ సర్కార్ తీరు మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ కు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది.
జాతీయ ఉపాధి హామీ పథకం బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి మండిపడింది. ఆగస్ట్ 1వ తేదీలోపు నరేగా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాలని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ఆగస్ట్ 1న, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టుకు హాజరుకావాలని సంచలన ఆదేశాలిచ్చింది.
ఈ విషయంపై ఎన్నిసార్లు చెప్పినా తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఎన్నిసార్లు చెప్పించుకుంటారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ వ్యవహారంలో ఏపీ సీఎస్ ఆథిత్యనాథ్ను కూడా పిలిపించాలని హైకోర్టు తొలుత భావించింది. అయితే, నిధులు గడువులోపే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పడంతో ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సుమారు రూ.2500 కోట్ల నరేగా నిధులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి, ఈ వ్యవహారంపై జగన్ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.