వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర్నుంచి ప్రభుత్వ ఘనతల గురించి పెద్ద ఎత్తునే ప్రకటనలు ఇస్తున్నారు. కొన్నిసార్లు అవి తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పుడు ఏపీ సమాచార పౌర సరఫరాల శాఖ తరఫున సాక్షి పత్రికలో ఇచ్చిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో దుమారానికి కారణమైంది.
తాజా ప్రకటన ఒక రకంగా ప్రభుత్వ ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేసేదనే చెప్పుకోవాలి. ఇంతకీ ఏం జరిగిందంటే..ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు సైతం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనివార్యంగా ఫిబ్రవరిలో ఎన్నికలకు నిర్వహించక తప్పని స్థితికి ప్రభుత్వం చేరుకుంది.
ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల గురించి ఏపీ సమాచార పౌర సరఫరాల శాఖ సాక్షిలో ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికలంటే పార్టీలతో సంబంధం లేకుండా జరిగేవని.. ఏకగ్రీవాలు అయిన పంచాయితీలకు ప్రభుత్వం నగదు బహుమతులు పెంచిందని అందులో పేర్కొన్నారు. జనాభాను బట్టి ఏకగ్రీవ పంచాయితీలకు ఇచ్చే నజరానాల వివరాలు ఇందులో ఇచ్చారు. ఇదంతా బాగుంది కానీ.. ఇందులో ఇచ్చిన ప్రభుత్వం ఎంబ్లమ్ ఏపీది కాదు. తెలంగాణది.
అలాగే తెలంగాణలోని ఓ పంచాయితీ కార్యాలయం బొమ్మ తీసి ఇందులో పెట్టారు. ఈ విషయాన్ని జనసేన నేత ఒకరు వెల్లడిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ పోస్టు వైరల్ అయింది. కోట్ల రూపాయలతో ప్రకటన ఇచ్చేటపుడు ఆమాత్రం చూసుకోకుండా ఇంటర్నెట్లో దొరికిన ఫొటో తీసి పెట్టేయడమేనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంటర్నెట్లో ఇచ్చిన యాడ్ అయితే తీసేసి రివైజ్ చేసుకోవచ్చు. కానీ లక్షల మందికి వెళ్లే పేపర్లో ఇచ్చిన యాడ్ కావడం ప్రభుత్వానికి ఇబ్బందికరమే.