అసలు జగన్ ఇలా చేస్తాడా? ఇది జరిగే పనేనా అనిపిస్తుంది కదా. పచ్చి నిజం. కాకపోతే ఇవే మాటలు అనలేదు గాని కంటెంట్ మాత్రం అదే. ఏపీలో స్థానిక ఎన్నికలు జరపకపోవడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. తాండవ యోగేష్ అనే న్యాయవాది హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. అయితే, కరోనా ఉన్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం కష్టం అని ఏపీ సర్కారు కోర్టుకు తెలిపింది.
ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపిన ఈ వాదన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇదే కారణంతో ఎన్నికలు వాయిదా వేస్తే కరోనా పై కూడా కమ్మముద్ర వేసిన ఘనులు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి తన స్థాయి కంటే తక్కువకు దిగి కుల వ్యాఖ్యలు చేయడం ఏపీలో అతిపెద్ద కలకలానికి దారితీసింది.
తాజాగా స్థానిక ఎన్నికల వ్యవహారం కోర్టుకు ఎక్కడంతో కోర్టు సర్కారుకు, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. కరోనా వల్ల ఎన్నికలు జరపడం కష్టం అని ఏపీసర్కారు అంటే అది చెప్పాల్సింది మీరు కాదు, ఎన్నికల సంఘం అని హైకోర్టు పేర్కొంది.
మరో 6 నెలల్లో నిమ్మగడ్డ పదవీకాలం ముగియనుంది. అందుకే అతని హయాంలో ఎన్నికలు జరపడానికి జగన్ సర్కారు ఇష్టపడటం లేదు. అందుకని కరోనాను సాకుగా వాడుకుంటోంది. అయితే, ప్రజా నిర్ణయాలు సొంత ప్రయోజనాలు చూసుకుని తీసుకోవడం కుదరదు కదా. అందుకే కోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. సమాధానం చెప్పాలని కోరింది.
మరి ఆయన కోర్టుకు ఏం చెబుతారో చూడాలి. ఎందుకంటే దేశంలో పలుచోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సాకు చెప్పడం కుదరదు. మరి ఎన్నికల సంఘం ఏమంటుంది. తర్వాత కోర్టు ఏమంటుంది. సర్కారు ఏమంటుంది… ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
నవంబరు 2వ తేదీన ఈ పిటిషన్ మళ్లీ విచారణకు రానుంది.