- 4 నెలలుగా ఇంకా ఇబ్బందులు
- అటు పెన్షనర్లకూ నరకం
- రిటైరై నెలలైనా పింఛను లేదు
- పీఆర్సీ అమలు దేవుడెరుగు
- కనీసం డీఏలకైనా దిక్కులేదు
- ప్రభుత్వోద్యోగుల్లో ఆవేదన
- పట్టించుకోని సంఘాల నేతలు
జీతాలు వచ్చే ఒకటో తేదీ ప్రభుత్వోద్యోగులకు పండగ. కానీ ఆ రోజున వారు వేతనాలు అందుకుని రెండేళ్లవుతోంది. గత నాలుగు నెలలుగా పరిస్థితి మరీ దిగజారింది. పాలు, కూరగాయలు అమ్మేవాళ్లకూ వారు చులకనైపోయారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా కొద్ది నెలల నుంచి అందడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
సంక్షేమ పథకాల పేరిట ఖజానా ఖాళీచేస్తున్న ప్రభుత్వం.. తమకు మాత్రం ఎప్పుడు జీతాలిస్తుందో తెలియడం లేదని వారు వాపోతున్నారు. పెన్షన్లు అందక పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వమైనా తొలుత ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, రిటైరైన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించడానికి ప్రథమ ప్రాధాన్యమిస్తుంది.
ఆ తర్వాతే ఇతరత్రా చెల్లింపులపై దృష్టిసారిస్తుంది. ఎన్నికల్లో వారు కీలకం కూడా కావడంతో ఒక్క రాష్ట్రప్రభుత్వం కూడా ఇందుకు భిన్నంగా వ్యవహరించే సాహసం చేయదు. కానీ జగన్ సర్కారు తీరే వేరు. 2019 ఆగస్టు నుంచి.. అంటే సరిగ్గా రెండేళ్లుగా.. జీతాలు-పెన్షన్లు దానికి తృతీయ ప్రాధాన్యంగా మారిపోయింది.
అసలే 50 వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటు ఉంది. అయినా ఓట్లు రాల్చే సంక్షేమ పథకాలకు, ఆ తర్వాత అస్మదీయులైన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసేస్తోంది. అవి పూర్తయ్యాక ఏమైనా మిగిలితే ఉద్యోగులకు వాయిదాల పద్ధతిలో వేతనాలు ఇస్తోంది. రుణాలు సమకూరితే పెన్షనర్లకు ఇస్తోంది. లేదంటే లేదు.
ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తున్నా.. వచ్చే మొత్తాన్ని అది ఓవర్‌డ్రాఫ్టు కింద జమవేసుకుటోంది. జీవిత చరమాంకంలో పెన్షనర్ల గోడు వినే నాథుడే లేడు. తమ సహచరుల బాధ ఉద్యోగ సంఘాల నేతలకూ పట్టడం లేదు. మద్దతుగా మాట్లాడకపోయినా పర్వాలేదు.. ఏకంగా ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు.
పీఆర్సీ మరచిపోవలసిందే..
11వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) తన నివేదిక సమర్పించినా అమలు చేయడానికి జగన్ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కటైనా అమలు చేయాలని వేడుకుంటున్నా లెక్కచేయడం లేదు. పొరుగున తెలంగాణలో పీఆర్సీతో పాటు పలు ప్రయోజనాలను కల్పించారు.
ఇక్కడ మాత్రం నివేదిక పరిశీలన పేరిట ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. ఆ తర్వాత ప్రైవేటు కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయిస్తున్నామన్నారు. జగన్ జమానాలో పీఆర్సీ రాదన్న విషయం ఉద్యోగులకూ అర్థమైపోయింది.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తానన్న జగన్.. అధికారంలోకి రాగానే ఆ హామీని అటకెక్కించారు. సీపీఎస్ ఉద్యోగులకు 30 నెలల బకాయిలు 90 శాతం నగదుతోపాటు 10 శాతం ప్రాన్ అకౌంట్‌కు, జనవరి జీతాల చెల్లింపు తర్వాత మూడు సమ భాగాల్లో జమచేస్తామని చెప్పినా, ఖాతాల్లో ఒక్క పైసా కూడా జమకాలేదు.
నిన్నమొన్నటి వరకు ఎవరూ గట్టిగా గళమెత్తే సాహసం చేయలేదు. నోరెత్తితే ఏసీబీతో దాడులు చేయిస్తారని భయపడ్డారు. ఇప్పుడిప్పుడే గళమెత్తుతున్నారు. సీపీఎస్ రద్దు కోసం క్రమంగా ఆందోళనలు పెంచుతున్నారు.
డీఏలు ఎప్పుడిస్తారు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో డీఏ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కేంద్రం ఒకేసారి డీఏను 11 శాతం పెంచడంతో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలను వైసీపీ సర్కార్ ఎప్పుడిస్తుందో అంటూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చెల్లిస్తామని చెప్పిన రెండు డీఏలతో పాటు మరో నాలుగు డీఏలు కలిపి మొత్తం ఆరు డీఏలు చెల్లించాల్సి ఉంది. డీఏ బకాయి సుమారు రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.