ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక వివాదాస్పద జీవోలు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏ విషయాల్లో అయితే విమర్శించిందో ఇప్పుడు అదే రీతిన వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. బాబు సర్కారుకు పబ్లిసిటీ పిచ్చి అని, ప్రచారం కోసం కోట్లు వృథా చేసిందని, తన అనుకూల మీడియాకు భారీగా ప్రకటనలు కట్టబెట్టిందని విమర్శించింది వైకాపా. కానీ ఇప్పుడు చూస్తే జగన్ ప్రభుత్వం సైతం అదే చేస్తూ వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులేయడం దగ్గర్నుంచి పబ్లిసిటీకి బోలెడంత ఖర్చు చేశారు. సాక్షి మీడియాకు భారీగా ప్రకటనలు సమర్పించారు. ఇలాంటి మరెన్నో నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. విమర్శల పాలయ్యాయి.ఐతే ఇప్పుడు జగన్ సర్కారు ఇచ్చిన లేటెస్ట్ జీవో మరింత ఆశ్చర్యానికి, షాక్‌కు గురి చేసేదే. జాతీయ స్థాయిలో నంబర్ వన్ ప్రతికగా ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న రహస్య ఒప్పందం ఒక జీవో ద్వారా వెలుగులోకి వచ్చింది. జాతీయ స్థాయిలో దెబ్బ తిన్న ముఖ్యమంత్రి జగన్ ఇమేజ్ను పెంచేలా వార్తలు ఇచ్చేందుకు టైమ్స్ ఆఫ్ ఇండియాకు రూ.8.15 కోట్ల నిధులు చెల్లించేందుకు ఏపీ సమాచార ప్రసార శాఖ జీవో ఇవ్వడం సంచలనం రేపుతోంది. ఈ నిధుల విడుదలకు కారణం వెల్లడిస్తూ ‘రాష్ట్రం, రాష్ట్రానికి చెందిన నాయకుల ఇమేజ్ను జాతీయ వేదికపై పెంచేందుకు’ అని ఈ జీవోలో పేర్కొనడం గమనార్హం. సమాచార శాఖ దగ్గర బడ్జెట్ లేకున్నా… దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు మంజూరు చేసి ఇస్తోంది. ఈ విషయమై ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర సమాచార ప్రసార శాఖకు ప్రతిపాదనలు రాగా.. దానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం రూ.8.15 కోట్లు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. తమ అనుకూల మీడియాకు పరోక్షంగా లబ్ధి చేకూర్చడం వేరే విషయం కానీ.. ఇలా ఇమేజ్ పెంచేందుకు వార్తలు ఇచ్చేందుకు గాను అధికారికంగా ఒక మీడియా సంస్థతో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం నభూతో అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇకపై జగన్‌కు సంబంధించి రాబోయే వార్తల్ని పెయిడ్ న్యూస్‌గా భావించాల్సి ఉంటుందేమో.