ఏపీ లో కూటమి సర్కార్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో జులై 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఉదయం నుంచి స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక కోసం వాహనాలు బారులు తీరాయి.
అయితే ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కాకపోవడంతో అధికారులు ఇసుక సరఫరా చేయకుండా ఎదురు చూపులు చూశారు. ఉన్నతాధికారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉచిత ఇసుక పాలసీపై సోమవారం మధ్యాహ్నం కొత్తగా జీవో నెంబర్ 43 ను విడుదల చేయించారు. 2019లో వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేశారు. అయితే కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
అలాగే 2024 ఇసుక విధానం రూప కల్పన వరకు సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త ఇసుక విధానం రూపొదించే వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపోతే వైసీపీ హయాంలో ఇసుక ఛార్జీలతో పాటు దాని లోడింగ్, తరలింపు, ఇతర పన్నులు కలిపి టన్నుకు రూ.475 వరకూ వసూలు చేసేవారు. అయితే నేటి నుుంచి ఉచిత ఇసుక పాలసీ అమలులోకి రావడంతో.. వినియోగదారులు రవాణా ఖర్చులు, చట్టపరమైన పన్నులు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది.