ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియగా…రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొంతమంది అభ్యర్థులను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేంగా ఓ యాప్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించింది. ‘ఈ-వాచ్’ పేరిట రూపొందించిన ఈ యాప్‌ను నిమ్మగడ్డ రమేష్ ఆవిష్కరించారు. ఈ-వాచ్ లో అభ్యర్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని, అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా తమకు సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదులు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఫిర్యాదులను పరిష్కరించిన తర్వాత ఆ వివరాలను ఫిర్యాదుదారులకు చెబుతామని పేర్కొన్నారు.
ఈ యాప్ రేపటి నుంచి ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజల్లో ఎన్నికలపై నమ్మకం కలిగించేందుకే ఈ యాప్ విడుదల చేస్తున్నామన్నారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం కాల్ సెంటర్‌ని కూడా నిమ్మగడ్డ ప్రారంభించారు. కాగా, ఈ-వాచ్ యాప్ పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ యాప్ భద్రతపై అనుమానాలున్నాయని, హ్యాక్ అయ్యే అవకాశముందని హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భద్రతాపరమైన అనుమతులు లేకుండానే ఈ-వాచ్ యాప్‌ను రహస్యంగా తయారు చేశారని పేర్కొంది. ఎన్నికలకోసం పంచాయతీరాజ్‌శాఖ యాప్ ఉందని, ఈ-వాచ్ యాప్ ఎందుకని ప్రశ్నించింది. ఈ వాచ్ యాప్ ఏపీలో కొన్ని పార్టీలకు లబ్ధి చేకూరేలా ఉందని పేర్కొంది. ప్రభుత్వ పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. దీంతో, ఈ వాచ్ యాప్ పై హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.