ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రులు, అనుమతించిన ప్రైవేటు ఆసుపత్రులు అని తేడా లేకుండా ఆక్సిజన్ తో కూడిన బెడ్ దొరకడం గగనమైపోయింది. ఈ క్రమంలోనే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా కరోనా పేషెంట్లకు చికిత్స చేసి లక్షలు దండుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో లక్షలకు లక్షలు పోసినా ప్రాణాలు దక్కని పరిస్థితి.
ఇక, ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ బెడ్ల కొరతతో ఏపీ, తెలంగాణ బోర్డర్ లో అంబులెన్సులు ఆగిపోయిన వైనం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ బాధితుల చికిత్స విషయంలో తాజాగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్ని ఏపీ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచనలు జారీ చేసింది.
దీంతోపాటు రోగులకు బెడ్లపై నిర్ధిష్టమైన సమాచార వ్యవస్థ అమలు చేయాలని కోరింది. కోవిడ్ పై దాఖలైన పలు పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆల్రెడీ అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్ 104తో పాటు మరో నంబర్‌ను కూడా అందుబాటులోకి తేవాలని సూచించింది. వ్యాక్సిన్ వేసేటప్పుడు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరింది.
వ్యాక్సినేషన్ సమయంలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తమకు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రోగులను దోపిడీ చేస్తోన్న ప్రైవేటు అంబులెన్సులపై చర్యలు తీసుకోవడం, అవసరమైతే వాటిని ప్రభుత్వ నియంత్రణలో తీసుకునే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఈ పిటిషన్లపై విచారణను ఈ నెల 20వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.