తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల పోలింగ్ ముగిసింది . ఇక, డిసెంబరు 3న రిజల్ట్ కూడా రానుంది. దీంతో వచ్చే ఐదేళ్ల కాలానికి తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ అంశాలు.. ఒక కొలిక్కి రానున్నాయి. ఇక, ఆ వెంటనే ఏపీ వంతు రానుంది. ఏపీలో ఇప్పటికే 2024 ఎన్నికలకు సంబంధించి వేడి ప్రారంభమైంది. ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజల మధ్య ఉంటున్నాయి. ఈ విషయంలో బీజేపీ కొంత వెనుకబడ్డా.. మిగతా రెండు పార్టీలు దూకుడుగా ఉన్నాయి.
అదేసమయంలో గత రెండేళ్లుగా వైసీపీ నాయకులు కూడా అధిష్టానం ఆదేశాలు.. టికెట్ వ్యూహాలతో ప్రజల మధ్య ఉంటున్నారు. దీంతో దాదాపు ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైందని అంటున్నా రు. అయితే.. తెలంగాణ ఎన్నికల తర్వాత.. ఈ సెగ మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇక, తర్వాత జరిగేది.. ఏపీ అసెంబ్లీ, సహా ఢిల్లీ ప్రభుత్వ ఎన్నికలే మిగిలి ఉన్నాయి. వీటికి సంబంధించి కాక ప్రారంభం అవుతుందని అంటున్నారు.
ఇక, టీడీపీ-జనసేనలు డిసెంబరు 2వ వారం నుంచి పక్కా కార్యాచరణతో ముందుకు కదులుతు న్నాయి. మరోవైపు ప్రజలను తన వైపు తిప్పుకొనే ప్రక్రియలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడం. కీలకమైన హోదా సహా.. మూడు రాజధానుల అంశాలను తెరమీదికి తీసుకురావడం.. వంటివాటికి వైసీపీ పదును పెడుతోంది. ఒకవైపు నాయకులను కదిలిస్తూ.. మరోవైపు విధాన పరమైన నిర్ణయాలతో డిసెంబరుచివరి వారానికి ఇక, ఎన్నికల క్షేత్రంలోకి పూర్తిస్థాయిలో వైసీపీ కాలు కదిపే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
గత ఎన్నికల సమయంలో కీలకమైన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉండగా.. ఇప్పుడు ఆలోటును ఐప్యాక్ తీరుస్తున్నా.. నేరుగా సీఎం జగన్ జోక్యం చేసుకుంటున్నారు. స్టార్ క్యాంపెయినర్ల నుంచి .. పార్టీ మేనిఫెస్టో వరకు.. ఆయన కసరత్తు డిసెంబరు 3వ వారం నుంచే ఉంటుందని తెలుస్తోంది. ఇక, టీడీపీ ఇప్పటికే మినీ మేనిఫెస్టో విడుదల చేసింది. అదేసమయంలో జనసేన-టీడీపీ ఉమ్మడి మినీ మేనిఫెస్టోను కూడా ఇటీవల ప్రకటించారు. సో.. మొత్తంగా చూస్తే.. తెలంగాణ సమరం తేలిపోవడంతో ఏపీలో యుద్ధం మొదలవుతుందని అంటున్నారు పరిశీలకులు.