కాకినాడ పోర్టు నుంచి దక్షిణాఫ్రికాకు 640 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న షిప్ ను కాకినాడ కలెక్టర్ రెండు రోజుల క్రితం అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ షిప్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షిప్ లో ప్రయాణించి పరిశీలించారు. ఈ క్రమంలోనే కాకినాడ పోర్టు అథారిటీపై పవన్ ఫైర్ అయ్యారు. ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక పెద్ద పెద్ద వ్యక్తులున్నారని, ఇంటర్నేషనల్ గా ఈ స్మగ్లింగ్ జరుగుతోందని, అయినా సరే ఎవ్వరినీ వదిలిపెట్టనని పవన్ హెచ్చరించారు.
కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో పాటు పోర్టు అధికారులపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే కష్టమని, ఈ రోజు బియ్యం అక్రమ రవాణా జరిగిందని, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు రావని గ్యారెంటీ ఏంటని పవన్ నిలదీశారు. కసబ్ వంటి టెర్రరిస్టులు కాకినాడ తీర ప్రాంతానికి వచ్చే అవకాశముందని, 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడా కాల్చేసినా దిక్కు లేదని, ఇక్కడ భద్రతా లోపాలు చాలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. 2 నెలల నుంచి ఇక్కడ పర్యటించాలని అనుకుంటున్నానని, కానీ, తననే అడ్డుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని చెప్పారు.
ఈ పోర్టు నుంచి డ్రగ్స్, ఆయుధాలు ఇతర దేశాలుకు వెళ్లే అవకాశం, అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మినిస్టర్ వంగలపూడి అనిత, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ వ్యవహారంపై లేఖ రాస్తామని అన్నారు. కాకినాడ పోర్టు అధికార యంత్రాంగంలో కూడా ప్రక్షాళన జరగాలని, సీఎం చంద్రబాబుకు ఈ విషయం గురించి చెప్పానని, మరోసారి కలిసి సీబీఐ, సీఐడీ దర్యాప్తు పై చర్చిస్తామని అన్నారు. ఇంటర్నేషనల్ స్మగ్లర్లయినా తాను లెక్కచేయనని, ఆ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న షిప్ ను సీజ్ చేయాలని పవన్ అన్నారు.