తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ నెయ్యి వాడారనే దానిపై ప్రాథమిక ఆధారాలు లేకుండా ఏపీ ప్రభుత్వం ఎలా ప్రకటన చేస్తుందని కోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. లడ్డులో వాడిన నెయ్యి కల్తీ కాలేదనిగానీ, అయిందనిగానీ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పలేదని పవన్ చెప్పారు. నెయ్యికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులో తేడాలు ఉన్న విషయం గురించి సుప్రీం కోర్టు ప్రశ్నించిందని గుర్తు చేశారు.
ఇక, ఆ వ్యవహారంపై విచారణ ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని, ఇంతకు మించి ఆ విషయంపై వ్యాఖ్యానించదలుచుకోలేదని పవన్ చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న కారణంతోనే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టలేదని, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని ఆలయాలపై దాడులు జరిగాయని, సనాతన ధర్మం, దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేసేందుకు దీక్ష చేపట్టానని పవన్ చెప్పారు. అంతేకాదు, ఆలయాల పరిరక్షణకు శాశ్వత విధానం తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు. రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి దుర్భరంగా ఉందని, అడిగేవారు లేరనే రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు.
జగన్ హయాంలో రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలను ఛేదినా ఎవరూ పట్టించుకోలేదని, అంతర్వేది రథాన్ని దగ్ధం చేశారని, విజయవాడ దుర్గమ్మ వెండి రథానికి ఉన్న బొమ్మలను కూడా దోచుకున్నారని గుర్తు చేశారు. పవిత్రమైన తిరుమలలో అన్యమతస్థుల జోక్యం పెరిగిందని, లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు.