ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చింది మొదలు తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. ప్రజా సమస్యలను తీర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు ఏపీ ఉప ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.
చిత్తూరు జిల్లా పరిధిలోని పార్వతీపురం తో పాటు పలమనేరు, కుప్పంలో ఏనుగుల గుంపు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేసి తీవ్ర నష్టానికి కారణం అవుతున్నాయి. ప్రజలకు ప్రాణ హాని కలిగిస్తున్నాయి. వారి సమస్యను పరిష్కరించేందుకే పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంతో సమావేశం అయ్యారు. సిద్ధరామయ్యతో సమస్య గురించి తెలిపారు.
గ్రామాల్లోకి వచ్చి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగులను కట్టడి చేయడానికి.. వాటికి తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని పవన్ వివరించారు. కర్ణాటకలో కుంకీ ఏనుగులు ఉండడంతో.. వాటిలో కొన్నింటిని తమ రాష్ట్రానికి పంపాలంటూ సిద్ధరామయ్య మరియు కర్ణాటక అటవీ శాఖకి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.