తిరుమల లడ్డూ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి, చాప నూనె వాడుతున్నారని ఆరోపణలు రావడంతో.. జాతీయస్థాయి నాయకులతో పాటు సినీ తారలు, సామాన్యులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. లడ్డు వివాదంపై ఇటీవల విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ఓ సంచలన పోస్ట్ పెట్టారు.
మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. దీనిపై వెంటనే విచారణ జరిపి నేరస్థులపై చర్యలు తీసుకోండి. అంతేగాని అనవసర భయాలు కల్పించి, జాతీయంగా చర్చించుకునేలా ఎందుకు చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఘర్షణ లు చాలు (కేంద్రంలో ఉన్న మీ ఫ్రెండ్స్ కు థాంక్యూ)` అంటూ ప్రకాష్ రాజ్ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ పై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తనదైన శైలిలో ప్రకాష్ రాజ్ కు ఇచ్చిపడేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆలయ మెట్లను స్వయంగా శుభ్రం చేసిన పవన్ కళ్యాణ్.. దర్శనానంతరం మీడియాతో మాట్లాడాడు. ప్రకాశ్ రాజ్ గారు నా గురించి మాట్లాడారు.. అసలు హిందువుల గురించి నేను మాట్లాడితే ఆయనకు సంబంధం ఏంటి? అని పవన్ ప్రశ్నించారు. నేను వేరొక మతాన్ని నిందిచానా..? క్రిస్టియన్, ఇస్లాం మతాల గురించి తప్పుగా మాట్లాడానా? తిరుపతిలో అపవిత్రం జరిగింది.. ఇలా జరగకూడదని చెబితే గోల చేస్తున్నారని అంటున్నారు.
తప్పు జరిగితే మాట్లాడకూడదా..? అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా..? దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడకూడదా..? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి. ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ గారికి చెబుతున్నాను.. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. సెక్యులరిజం అంటే టూ వే… వన్ వే కాదని గుర్తించుకోండి` అంటూ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు.