ఏపీ మాజీ సీఎం జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. తన స్వార్జితమైన ఆస్తిని షర్మిలకు జగన్ పంచారని వైసీపీ నేతలు అంటుండగా…వైఎస్ఆర్ ఆస్తులకు జగన్ గార్డియన్ మాత్రమేనని షర్మిల చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య వివాదానికి కారణమైన సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ భూముల్లో అటవీ భూములు, వాగులు, కొండలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ భూములపై ఫోకస్ పెట్టారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాలలో ఆ సంస్థకు చెందిన 1515 ఎకరాల భూముల్లో అటవీ భూములు ఉన్నాయా? ఉంటే ఎంత మేర ఉన్నాయి అన్న విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు. ఈ క్రమంలోనే పవన్ ఆదేశాల ప్రకారం అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లోని సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అధికారులు భూ సర్వే చేపట్టారు.
దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొని భూముల లెక్క తేలుస్తున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత అటవీశాఖ అధికారులు సమగ్ర నివేదిక రూపొందించి పవన్ కల్యాణ్ కు సమర్పించనున్నారు. ఒకవేళ వీటిలో అటవీ భూములు, పర్యావరణ అనుమతులకు వ్యతిరేకంగా మంజూరైన భూములు ఉంటే జగన్ కు మరిన్ని చిక్కులు తప్పవు.