ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్దిసేపటికే జగన్ సర్కారు తన వ్యతిరేకత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ ఏపీ కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన హడావుడిగా ఈ ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల కమిషనర్ పంపించిన నోటిఫికేషన్ తమకు అందిందని, అయితే దీన్ని తాము అంగీకరించేది లేదని సీఎస్ ఆదిత్యనాథ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోందని, రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించామని సీఎస్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సూచనలతో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతున్నామని.. రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉందని.. గ్రామ వలంటీర్ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో విధులు నిర్వర్తించాల్సి ఉంది కాబట్టి, రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సును మనసులో ఉంచుకుని ఎన్నికలను వాయిదా వేయాలన్నారు.
మరోవైపు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది ఎస్ఈసీ నిర్ణయాన్ని తప్పు పడుతూ మరో ప్రకటన విడుదల చేశారు.
ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ ద్వివేది అన్నారు.