ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే…నిర్మాణ రంగంలో ఉన్న చిన్నాచితకా కంపెనీలు మొదలు పేరుమోసిన బడా కార్పొరేట్ కంపెనీల అధినేతల వరకు అందరూ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటారు. రోడ్ల మరమ్మత్తులు, సీసీ రోడ్లు, రహదారి విస్తరణ మొదలు…పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టు పనులు చేజిక్కించుకునేందుకు లాబీయింగ్ చేస్తుంటారు. ఆయా పనుల కోసం టెండర్లు ఎప్పుడు పిలుస్తారా…తమ నెట్వర్క్ ఉపయోగించి తక్కువ ధరకు టెండర్ వేసి ఆ నిర్మాణ కాంట్రాక్టు ఎలా కొట్టేద్దామా అని కాచుకు కూర్చుంటారు.
అయితే, ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పాలనలో సీన్ రివర్స్ అయింది. కోట్ల విలవైన కాంట్రాక్ట్ ఉంది…టెండర్ వేసుకోండి అంటే…కాంట్రాక్టర్లు కిక్కురుమనడం లేదు. మీకింత…మాకింత…అని పోకిరిలో మహేష్ బాబు తరహాలో మంత్రుల పేషీలలోని మధ్యవర్తులు లాబీయింగ్ చేసినా కూడా కాంట్రాక్టర్లు సచివాలయం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. తాజాగా, దాదాపు రూ.186 కోట్ల విలువైన రోడ్ల మరమ్మతులు, విస్తరణ పనులకు సంబంధించిన కాంట్రాక్టు కోసం టెండర్ వేసేందుకు ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాకపోవడం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులకు రూ.186 కోట్లతో 96 రోడ్లకు ఆర్అండ్బీ అధికారులు టెండర్లు పిలిచారు. అయితే, దాదాపు రెండువందల కోట్ల విలువైన కాంట్రాక్టును కొట్టేసేందుకు తహతహలాడాల్సిన కాంట్రాక్టర్లు…కనీసం టెండర్ పేపర్ కూడా పట్టుకోవడానికి ఇష్టపడడం లేదట. అప్పుల కుప్పలా మారిన ఏపీ ఆర్థిక పరిస్థితిపై వస్తున్న కథనాలు, జగన్ అప్పు చేసి పప్పుకూడుపై కేంద్రం సైతం ఆరా తీయడం, ఇప్పటికే చాలామంది కాంట్రాక్టర్లు గత రెండేళ్లుగా చేసిన పనులకు నయాపైసా బిల్లులు రాకపోవడం వంటి కారణాలతో కాంట్రాక్టర్లు కుదేలైపోయారట.
ఒకవేళ అప్పో సప్పో చేసి టెండర్ వేస్తే…ప్రభుత్వం నుంచి బిల్లులు ఎప్పుడు వస్తాయనే గ్యారెంటీ లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల కోసం కోర్టులకెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ వస్తే నిర్మాణ రంగం ఊపందుకుంటుందని ఓటేసిన తమ బ్రతుకులు దుర్భరమయ్యాయని కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో హాట్ కేక్ లా మారే టెండర్ ప్రక్రియ…ఇపుడు సద్ది కేక్ లా మారిందని కాంట్రాక్టర్లు అంటున్నారు. టెండరు వేయండి మహాప్రభో అని పదే పదే గడువు పొడిగిస్తున్నా కాంట్రాక్టర్లెవరూ టెండర్ వేసేందుకు సాహసించడం లేదు. పనులు పూర్తి కాగానే బిల్లులు ఇప్పిస్తామని కొంతమంది మంత్రులు చెప్పినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటే కాంట్రాక్టర్లు ఏ రేంజ్ లో హడలిపోతున్నారో అర్థమవుతోంది.
మరోవైపు, ఏపీ ప్రభుత్వం పిలిచే టెండర్లలో పాల్గొనకూడదని జగన్ ను కాంట్రాక్టర్లు బ్యాన్ చేశారని తెలుస్తోంది. ఇలా తమ నిరసన తెలిపితే అయినా చేసిన పనులకు బిల్లులు వస్తాయేమోనని వారు అనధికారికంగా ఏపీ ప్రభుత్వంపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి, ఈ కాంట్రాక్టర్ల అనుమానాలను జగన్ నివృత్తి చేయకుంటే ఏపీలో గతుకుల రోడ్లకు అతుకులు వేసే వారు కూడా ఉండరని, గుంతల రోడ్లలో ప్రయాణాలు చేసి నడుము నొప్పులతో ఆరోగ్య శ్రీలో ఆస్పత్రిలో చేరితే ఆ బిల్లులు కూడా జగనే చెల్లించాలని, దానికి బదులు రోడ్లు బాగు చేయిస్తే వృతం…ఫలితం రెండూ దక్కుతాయని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.