ఏపీ రాజధాని గురించి.. ఇప్పటికే అనేక విమర్శలు.. వివాదాలు నడుస్తున్నాయి. అమరావతే రాజధాని అని చెబుతున్న కేంద్రం దీని అభివృద్ధిని పట్టించుకోవడం లేదు.ఇక, మూడు రాజధానులు అని చెబుతున్న వైసీపీ.. ఈ పీట ముడిని విప్పేందుకు ప్రయత్నం చేయడం లేదు. దీంతో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఈ భారత దేశంలో ఏదైనా ఉందా? అంటే.. అది ఏపీనే అనే సమాధానం వస్తోంది.
ఇదిలావుంటే.. తాజాగా.. విశాఖకు చెందిన ప్రజా ఉద్యమ సంస్థ జన జాగరణ సంస్థ(జేజేవో) వినూత్న పోటీ కి పిలుపునిచ్చింది. మూడు ప్రశ్నలు.. మూడు లక్షలు అంటూ.. జేజేవో ప్రకటించింది. వీటిలో మూడు ప్రశ్నలు సంధించారు. ఈ మూడు ప్రశ్నలకు ఒక్కొక్క సమాధానం చెప్పిన వారికి ఒక్కొక్క లక్ష రూపాయ లు బహుమానంగా అందిస్తామని.. జేజేవో ప్రకటించింది. అయితే.. ఈ పోటీ వెనుక.. ఉన్న ఉద్దేశం ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణేనని ఇట్టే అర్థమవుతోంది.
ఇక, జేజేవో అడిగిన మూడు ప్రశ్నలు ఇవే..
1) ఏపీ రాజధాని ఏది?
2) పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది?
3) విశాఖ ఉక్కుకు దిక్కువరు
ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి జనజాగరణ సమితి నగదు బహుమానం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మొత్తంగా చూస్తే.. ఈ పరిస్థితి వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టని అంటున్నారు జేజేవో నేతలు. అదేసమయంలో ఇతర రాజకీయ పక్షాలు కూడా.. విశాఖ ఉక్కును కాపాడే ప్రయత్నం చేయడం లేదని.. పోలవరం ప్రాజక్టుపై కేంద్రం ఉదాసీనత వంటి అంశాలను కూడా తాము ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్నలు.. సంధించినట్టు చెబుతున్నారు. కనీసం ఇప్పటికైనా.. పార్టీలు, ప్రభుత్వం కళ్లు తెరవాలనేదివారి ఆకాంక్షగా జేజేవో ప్రతినిధులు పేర్కొన్నారు.