బీజేపీ నాయకులు మళ్లీ ఏపీని ముంచేస్తున్నారా? ఇప్పటికే హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచేసిన ఈ నేతలు.. ఇప్పుడు విశాఖ ఉక్కు, రాష్ట్రానికి బడ్జెట్లో జరిగిన అన్యాయంపైనా అలానే వ్యవహరి స్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా ఉద్యమి ద్దామని.. రాష్ట్ర ప్రయోజనాలే కీలకమని చెప్పినా..కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు బీజేపీ నేతలు ఎంతగా భజన చేశారో తెలిసిందే. ప్యాకేజీ ఇస్తున్నారుగా.. దీనిని మించిందా? హోదా అంటూ.. వ్యాఖ్యలు గుప్పించారు.
ఇక, వెనుక బడిన జిల్లాల అబివృద్ది నిధులను వెనక్కి తీసుకున్న మోడీ సర్కారుపై ఉద్యమించేందుకు సైతం రాష్ట్ర బీజేపీ నేతలకు మనసు రాలేదు. కనీసం ప్రశ్నించే సాహసం కూడా చేయలేక పోయారు. ఇక, ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నారనే విషయంపై కూడా అంతే ఉదాశీనంగా.. వ్యవహరిస్తున్నారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ వేడి.. రాష్ట్రంలోని మిగిలిన పార్టీలను తాకినా.. బీజేపీ మాత్రం మౌనంగా ఉంది. అంతేకా దు.. తాజాగా దీనిపై స్పందించిన పార్టీ జాతీయ నాయకురాలు పదవిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పురందే శ్వరి.. కనీసం చీమ కుట్టినట్టు కూడా స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి.
“మా పార్టీ వైఖరి మాకుంటుంది. కేంద్రంలోని పెద్దలు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మా వైఖరిని చెబుతాం. తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది“ అని చాలా లైట్‌గా తీసుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే.. నాడు ప్రత్యేక హోదాకు మంగళం పాడినా.. బీజేపీ నేతలు మౌనంగా ఉండిపో యారు. ఇక, ఇప్పుడు కూడా ఇలానే తమ పదవుల కోసం.. తమ ప్రాపకం కోసం.. పాకులాడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అవకాశం ఉండి.. కూడా పోరాడకపోతే.. విశాఖ ప్రజలే కాదు.. రాష్ట్ర ప్రజలు.. బీజేపీని భూస్థాపితం చేయడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. విశాఖ ఉక్కుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పురందేశ్వరి అంగీకరించలేదు. పైగా.. కేంద్రంలో ఉన్న వారికన్నా.. ఇక్కడి వారు మేధావులా? అనే టైపులో మాట్లాడారు. ఇక, పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. ఇప్పటి వరకు ఈ విషయంపై గొంతు విప్పలేదు.. పన్ను ఎత్తలేదు. మొత్తానికి ఏపీకి మరో కుంపటి పెట్టినా.. వీరంతా .. చూస్తూ ఊరుకుంటారు. ఏపీ ప్రజలు మాత్రం సోము వీర్రాజును, బీజేపీని గెలిపించాలి.. వారిని అధికారంలోకి తీసుకురావాలి!! వ్వాటే స్ట్రాటజీ.. సోమన్నా!!