దక్షిణాది రాష్ట్రాలలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ చిరకాల వాంఛ. అందుకు తగ్గట్లుగానే తెలంగాణలో కాస్త బలపడిన బీజేపీ….ఏపీలో మాత్రం చతికిలబడిందన్న టాక్ ఉంది. అయితే, ఏపీలో బీజేపీ బలోపేతం కాకపోవడానికి కొందరు ఏపీ బీజేపీ నేతలే కారణమన్న విమర్శలున్నాయి. ఈ విమర్శలన్నీ స్వయంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలే చేయడం విశేషం.
ఈ నెల 11న ప్రధాని మోడీ విశాఖలో పర్యటించబోతున్నారు. వాస్తవానికి ఈ సభ ఏర్పాట్లలో ఏపీ బీజేపీ నేతలు చురుగ్గా పాల్గొనాలి. కానీ, ఆ ఏర్పాట్లన్నీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీంతో, ఆల్రెడీ ఏపీ బీజేపీ నేతలు కొందరు వైసీపీతో అంటకాగుతున్నారన్న విమర్శలు నిజమేనని టాక్ వస్తోంది. వైసీపీ మీద పోరాటం చేయాల్సిన బీజేపీ నేతలు ఇలా మిత్ర పక్షంలా వ్యవహరిస్తే బీజేపీ మనుగడ ప్రశ్నార్థకమని విశాఖ బీజేపీ నాయకుడు విష్ణు కుమార్ రాజు ఆవేదన చెందుతున్నారు.
వైసీపీతో ఏపీ బీజేపీ కలిసి ఉందన్న ముద్రను చెరిపేసుకోకపోతే కష్టమని ఎమ్మెల్సీ మాధవ్ అభిప్రాయపడ్డారు. వీర్రాజు పనితీరు బాగోలేదని, అందరినీ కలుపుకుపోవడం లేదని సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ బహిరంగంగానే విమర్శించారు. ఏపీ బీజేపీ ఇద్దరు ముగ్గురు నేతల చెప్పుచేతల్లో ఉందని, రిమోట్ మాత్రం వైసీపీ దగ్గర ఉందని కొందరు బీజేపీ నేతలు వాపోతున్నారు. జీవీఎల్, దేవధర్, సోములకు ఓ రోడ్ మ్యాప్ ఉందని, వైసీపీ కనుసన్నల్లో ఆ రూట్ ఉంటోందని కొందరు బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సుజనా చౌదరి, పురంధేశ్వరి వంటి నేతలు ఆ ముగ్గురి తీరుతో అసంతృప్తితో ఉన్నా….వారిపై ప్రో టీడీపీ అనే ముద్ర వేసి ఆ అసహనాన్ని బయటకు రానివ్వలేదు. ఇక, విశాఖలో వైసీపీ నేతల కబ్జాలు, తవ్వకాలు, బాక్సైట్ అక్రమాలు, గంజాయి రవాణా వంటి వాటిని కప్పిపుచ్చుకునేందుకు పాలనా రాజధాని అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఆ వ్యవహారాలు కనబడకుండా బీజేపీ ఎంపీ జీవీఎల్ పావులు కదుపుతున్నారని టాక్.
తాను విశాఖలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని ప్రధాని మోడీని కోరానని, అవసరమైతే తాను విశాఖ ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేస్తానని జీవీఎల్ చెప్పడం వెనుక మతలబు ఇప్పుడు అర్థమవుతోందట. జీవీఎల్ ఇచ్చే ఇన్ పుట్స్ తో మోడీ చెప్పే స్పీచ్ వల్ల క్రెడిట్ జీవీఎల్ కి, లాభం వైసీపీకి అన్న టాక్ ఉంది. వైసీపీ సర్కార్ పై మోడీ కూడా ఏం మాట్లాడలేదు అని ఏపీ బీజేపీ నేతల నోరు నొక్కొచ్చన్నది జీవీఎల్ ప్లాన్ అని టాక్.