బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల కాలంలో పెద్దగా రియాక్ట్ కావడం లేదు. తనను పదవి నుంచి పక్కకు తప్పించిన తర్వాత.. పెద్దగా యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. అయితే.. అప్పుడప్పు డు.. అవకాశం వచ్చిన ప్రతిసారీ.. ఒకింత ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. రాజధాని విషయంలోను, ఎస్సీలపై దాడుల అంశంలోనూ. ఇసుక అక్రమాల విషయంలోనూ.. కన్నా బాగానే రియాక్ట్ అయ్యారు. ఇది.. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కంటే.. ఓ మెట్టు ఎక్కువ రేంజ్‌లోనే.. వైరల్ అయింది. దీంతో కన్నా వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.
తాజాగా వినాయకచవితి వేడుకల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు.. ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేతలు.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. కొవిడ్ నిబంధనల పేరిట.. చవితి నిర్వహణను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్ విశ్వభూషణ్‌కు వినతిపత్రం సమర్పించారు. నిరసన తెలిపినవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పందిళ్లు వేసుకుని ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందువులపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చవితిని ఇంట్లోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ జీవోను ఖండిస్తున్నామన్నారు. సినిమా హాళ్లు, స్కూళ్లు, బార్లకు లేని కొవిడ్ నిబంధనలు.. ఉత్సవాలకేంటని నిలదీశారు. వినాయక చవితికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా పండగ జరిపి తీరతామని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే.. కన్నా వ్యాఖ్యలు జోరుగా వైరల్ అవుతున్నాయి. నిజమేగా.. స్కూళ్లకు, పరీక్షలకు, బార్లకు, సినిమా హాళ్లకు లేని కరోనా.. ఒక్క చవితి వేడుకలకే వస్తుందా? అని సోషల్ మీడియాలో కామెంట్లు జోరందుకున్నాయి. మరి దీనికి వైసీపీ నాయకలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.