2021లో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ నేతలు దొంగ ఓట్ల నమోదుకు తెరతీశారని ఆరోపణలు రావడం, దానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్ తోపాటు మెప్మా డైరెక్టర్, కొంతమంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే ఈ దొంగ ఓట్ల వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు.
దొంగ ఓట్ల నమోదు, ఫేక్ ఎపిక్ కార్డులున్నాయన్న ధైర్యంతోనే సీఎం జగన్, వైసీపీ నేతలు వై నాట్ 175 అంటున్నారని పురంధేశ్వరి షాకింగ్ కామెంట్లు చేశారు. గతంలో తిరుపతి బై ఎలక్షన్ లో ఫేక్ ఎపిక్ కార్డులు తయారు చేసి, దొంగ ఫోటోలు వాటి మీద అంటించి, ఫోటోలు బ్లర్ చేసి 35 వేల దొంగ ఓట్లు వైసీపీ నేతలు వేయించుకున్నారని ఆరోపించారు. అప్పట్లోనే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారని, ఆ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై సీఈసీ చర్యలు తీసుకుందని అన్నారు.
ఆ దొంగ ఓట్ల వ్యవహారం ఒక్క తిరుపతి బై ఎలక్షన్ వరకే పరిమితం కాలేదని ఆరోపించారు. వైసీపీ సిట్టింగ్ అభ్యర్థులను మాత్రమే జగన్ మార్చడం లేదని, ఆ అభ్యర్థులతోపాటు వారి అనుచరులకు సంబంధించి వేల సంఖ్యలో ఓటర్లను కూడా మారుస్తున్నారని ఆరోపించారు. చిలకలూరిపేట నుండి విడదల రజనీని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ ఇన్ చార్జిగా నియమించారని, చిలకలూరిపేట నుంచి రజనీ అనుయాయులైన 10 వేల మంది ఓటర్లను గుంటూరు వెస్ట్ లో నమోదు చేయించుకునే ప్రక్రియ లోపాయికారిగా జరుగుతోందని ఆరోపించారు.
అది చిలకలూరిపేటకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో జరిగే అవకాశముందని పురంధేశ్వరి ఆరోపించారు. ఆ ధీమాతోనే జగన్, వైసీపీ నేతలు వై నాట్ 175 అంటున్నారు అని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఈ విషయంపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు గతంలో ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారని, మరోసారి ఈ వ్యవహారాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.