విజయవాడ పున్నమి ఘాట్ వద్ద విజయవాడ టు శ్రీశైలం ‘సీ ప్లేన్’ ను ఏపీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు. సీ ప్లేన్ ప్రయాణం వినూత్నమైన అవకాశం అని, దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చి సంపద సృష్టి జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీ గుజరాత్ లో సీ ప్లేన్ ప్రారంభించాలని చూశారని, కానీ, కొన్నికారణాల వల్ల అది సాధ్యపడలేదని చెప్పారు. దేశంలో మొట్టమొదటి సారి సీ ప్లేన్ ను ఏపీలో ప్రారంభించామని, రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండడం మనకు మంచి అవకాశమని అన్నారు.
సీ ప్లేన్ లు నడిపేందుకు విమానాశ్రయాలు అక్కర లేదని, బ్యాక్ వాటర్, రిజర్వాయర్ల దగ్గర జెట్టీలు ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో సీ ప్లేన్ నడపొచ్చని చెప్పారు. మరో 4 సంవత్సరాల్లో 10-15 సీ ప్లేన్ సర్వీసులను మొదలుబెట్టాలని, ఏపీలోనే రెండు సీ ప్లేన్ లను వాడుకుంటామని చెప్పారు. ఐదేళ్లుగా రాష్ట్రాన్ని గాలికొదిలేశారని, వ్యవస్థలను బాగు చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని బ్రతికిస్తున్నామని, కేంద్రం సహకారంతో ఏపీని నంబర్ వన్ గా నిలబెట్టే వరకు నిద్రపోనని అన్నారు.
పున్నమి ఘాట్ నుండి సీ ప్లేన్‌లో చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు, ఇతర మంత్రులు ప్రయాణించి శ్రీశైలం చేరుకుంటారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత తిరిగి సీ ప్లేన్ లో విజయవాడ పున్నమి ఘాట్‌కు చంద్రబాబు ఈ రోజు సాయంత్రం చేరుకోనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఘాట్ ల దగ్గర భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.