అన్నదాతలు ఖుషీ అయ్యేలా ఏపీ సర్కార్ నుంచి తాజాగా ఓ తీపి కబురు వెలువడింది. అన్నదాత సుఖీభవ పథకంపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక అప్డేట్ ఇచ్చారు. పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ పేరుతో కేంద్రం ప్రభుత్వం ఒక్కో రైతుకు ప్రతి ఏడాది రూ. 6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. సూపర్ సిక్స్ హామీల్లో ఇదీ ఒకటి.
ఇటీవల 2024-25 బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. కానీ ఇంత వరకు రైతుల ఖాతాలో డబ్బు జమ కాలేదు. ఇలాంటి తరుణంలో మంత్రి అచ్చెన్నాయుడు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చి యార్డుపై సమీక్ష ముగిసిన అనంతరం అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. అందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయని..మరికొద్ది రోజుల్లో ఈ పథకానికి మార్గదర్శకాల్ని విడుదల చేస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ. 20 వేలు అందిస్తామని స్పష్టం చేశారు.
ఇక ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డు గా పేరున్న గుంటూరు మిర్చి యార్డులో రూ.350 కోట్ల అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని.. నివేదిక అందిన వెంటనే బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అచ్చెన్న హెచ్చిరించారు. అలాగే రాబోయే మిర్చి సీజన్లో ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.