ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ధాటికి భారత్ విలవిలలాడిపోతోంది. మన దేశంపై కరోనా సెకండ్ వేవ్ సునామీలా విరుచుకుపడడంతో రోజుకు 3-4లక్షల కేసులు నమోదవుతున్నాయి. కేసులు తీవ్రస్థాయిలో నమోదవడంతో కరోనా చికిత్సలో కీలకమైన రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లతో పాటు ఇతర ఔషధాలకు తీవ్ర కొరత ఏర్పడింది.
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కరోనాపై బ్రహ్మాస్త్రం వంటి ఔషధాన్ని భారత రక్షణ సంస్థ DRDO అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు 2DG (2-డియాక్సీ డి-గ్లూకోజ్) ఔషధాన్ని కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్, హర్షవర్ధన్ విడుదల చేశారు. తొలి బ్యాచ్ 2డీజీ సాచెట్లను ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ కు రాజ్ నాథ్ అందజేశారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు 2డీజీ సాచెట్లను అందజేశారు.
కరోనా చికిత్సలో ఓ మైలురాయి అని భావిస్తోన్న 2డీజీ డ్రగ్ 10వేల డోసులను ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు పంపిణీ చేయనున్నారు. సాచెట్ లో పౌడర్ రూపంలో ఉండే ఈ ఔషధాన్నీ నీటిలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. కరోనాపై పోరులో 2డీజీ కీలక పాత్ర పోషిస్తుందని డీఆర్డీవో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వైరస్ ఉన్న కణాల్లోకి ఈ ఔషధం చేరి వైరస్ వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీఓ పేర్కొంది.
2డీజీతో కొవిడ్ రికవరీ సమయం, ఆక్సిజన్ అవసరం తగ్గిపోతుందని పేర్కొంది. మే 27, 28 తేదీల్లో రెండో విడతలో మరిన్ని సాచెట్లను విడుదల చేయనున్నామని తెలిపింది.జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లో 2డీజీ అందుబాటులో ఉంటుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వెల్లడించింది. ఈ 2డీజీ డ్రగ్ పౌడర్ ధరను ఇంకా ప్రకటించలేదు.