ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పటికీ ఈ కేసు విచారణ నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగడం ఒక ఎత్తైతే చివరకు ఈ కేసు పొరుగు రాష్ట్రం తెలంగాణకు తరలిపోవడం మరొక ఎత్తు. ఇక, ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మూడుసార్లు సిబిఐ విచారణకు హాజరవడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
ఇక, దాదాపుగా వివేకా కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఊహాగానాలు వస్తున్న తరుణంలో ఈ కేసులో సరికొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ హత్యతో తన భర్తకు సంబంధం లేదని, సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్ దాఖలు చేశారు.
అంతేకాదు, వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివ ప్రకాష్ రెడ్డిలను కూడా విచారణ జరపాలని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మార్చి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ ప్రైవేట్ కేసు దాఖలు చేయగా తాజాగా ఈరోజు ఆమె వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. అంతేకాదు, ఇందుకు సాక్షిగా వివేకా పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కూడా కోర్టు రికార్డు చేసింది. ఆ తర్వాత ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు కోర్టు వాయిదా వేసింది.
అంతకుముందు, వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారని, సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్ ను మార్చాలని కోరుతూ తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు…విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ సీబీఐ దర్యాప్తు అధికారిని ప్రశ్నించింది. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి సజావుగానే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, దర్యాప్తు సక్రమంగానే నిర్వహిస్తున్నారని సుప్రీం ధర్మాసనానికి రాంసింగ్ తరఫు లాయర్ తెలిపారు. ఇరు పక్షాల వాదన విన్న న్యాయస్థానం ఈ పిటిషన్ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.