ఏపీ సీఎం జగన్.. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అ యితే.. దీనికి సంబందించి ఆయన చేయాల్సింది.. పాలనను సక్రమంగా చేయడమే. కానీ, దీనికి భిన్నం గా.. ఆయన ప్రజలకు తాయిలాలు పంచుతున్నారు. ఇవే తనను మళ్లీ మళ్లీ అధికారంలోకి తీసుకువస్తా యని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న సంక్షేమ పందేరంతో ఇప్పటికే ఏపీ అప్పుల కుప్పగా మారిపోయిందని.. ఆర్బీఐ.. ఇటీవలే ప్రకటించింది.
అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇదిలావుంటే.. ఇప్పుడు మరో ఎత్తుగడ వేశారు జగన్. వచ్చే ఎన్నికల నాటికి పేదలను.. తనవైపు తిప్పుకొనేందుకు `జగనన్న కాలనీ`లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 30 లక్షల మంది పేదలకు ఆయన రాష్ట్రంలో స్థలాలు ఇచ్చారు. ఇక,వాటి కోసం.. కొండ, పోరంబోకు, ఎందుకూ పనికిరాని స్థలాలను, వివాదాస్పద భూములను కూడా కొనిపారేశారు. ఇక, ఇప్పుడు పేదలు మాత్రమే ఓట్లు వేస్తే.. తను అధికారంలోకి రావడం కల్ల అనుకున్నారో…ఏమో.. ఇప్పుడు మధ్యతరగతి వర్గానికి కూడా గేలం వేస్తున్నారు.
ఈ క్రమంలో.. రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నివాస ప్లాట్లు అందించేందుకు సిద్ధమయ్యారు. దీనికి గాను రూపొందించిన `జగనన్న స్మార్ట్ టౌన్షిప్`లకు ప్రభుత్వ శాఖల వద్ద ఖాళీగా ఉన్న, ఉపయోగించని భూములను పెద్ద ఎత్తు వాడేయాలని నిర్ణయించారు. ఆయా భూములను గుర్తించి జిల్లా కలెక్టర్ ముందుస్తుగా పొజిషన్ తీసుకొని పురపాలక శాఖకు అప్పగించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి తాజాగా ఉత్తర్వులు (193) జారీ చేశారు. పట్టణాల పరిధిలో తక్కువ ధరకే మధ్యతరగతి ప్రజలకు నివాస ప్లాట్లు(200 నుంచి 240 గజాలు) విక్రయించేందుకు ప్రభుత్వం తొలుత మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్(ఎంఐజీ)లను ప్రతిపాదించింది. వీటినే జగనన్న స్మార్ట్టౌన్షిప్లుగా పిలుస్తున్నారు.
ఈ పథకం కింద మధ్య తరగతి ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అయితే.. మధ్యతరగతి వర్గానికి మేలు చేయడం మంచిదే. కానీ.. ప్రభుత్వం వద్ద ఉన్న భూములను గుండుగుత్తుగా .. ఊడ్చేసి.. మధ్యతరగతికి పంచేస్తే.. రేపు ఏదైనా విదేశీ పరిశ్రమో.. లోకల్ పారిశ్రమిక వేత్తలో వచ్చి పెట్టుబడులు పెడతామంటే.. భూములు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు? అనే మౌలిక ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. గతంలో చంద్రబాబు హయాంలో పేదలకు టౌన్ షిప్లు నిర్మిస్తూనే.. భూబ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నించారు.
దీనికే ఆయన ఆపశోపాలు పడాల్సి వచ్చింది. ఇప్పటికీ.. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి భూబ్యాంక్లేక.. ఆయా పరిశ్రమల ఏర్పాటు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం వద్ద.. ఉన్న కొద్ది పాటి భూములను కూడా రాజకీయ కోణంలో.. పందేరం చేస్తే.. మున్ముందు పెట్టుబడులు.. వచ్చే అవకాశం కూడా లేదని.. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పెట్టుబడుల రంగం మరింత దారుణంగా మారి..ఏపీ ఇక, నాశనమేనని అంటున్నారు పరిశీలకులు.