జాతీయస్థాయిలో సమాజ్ వాదీ పార్టీకి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో ములాయన్ సింగ్ యాదవ్ స్థాపించిన ఈ పార్టీ అక్కడ బీఎస్పీ, కాంగ్రెస్, బిజెపిలకు దీటుగా పలు ఎన్నికలలో పోటీనిచ్చింది. యూపీలో గతంలో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన ఈ పార్టీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే, టీడీపీ గుర్తు సైకిల్, సమాజ్ వాది పార్టీ గుర్తు కూడా సైకిల్ కావడంతో ఆ పార్టీ పోటీ వ్యవహారంపై చర్చ మొదలైంది.
జాతీయ హోదా ఉన్న సమాజ్ వాదీ పార్టీ 2024 ఎన్నికలలో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు కూడా గతంలో ప్రకటించారు. 1992లో కూడా ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ ఏపీలో పోటీ చేసింది. అయితే, ఈ రెండు జాతీయ పార్టీలే. జాతీయ పార్టీగా టిడిపి కూడా ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. దీంతో రాబోయే ఎన్నికల్లో రెండు సైకిల్ గుర్తులు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తాయా అన్న చర్చ మొదలైంది.
ఒకవేళ 2024 ఎన్నికలలో ఎస్పీ కూడా పోటీ చేయడం ఖాయం అయితే రెండు పార్టీలకు సైకిల్ గుర్తు కేటాయిస్తారా అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే, స్థానిక పార్టీగా టీడీపీ ఉంది కాబట్టి టీడీపీకే కేంద్ర ఎన్నికల సంఘం సైకిల్ గుర్తు కేటాయించే అవకాశముంది. వాస్తవానికి సమాజ్ వాది పార్టీతో కూడా చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. చంద్రబాబు అరెస్టును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఖండించారు. కాబట్టి, గుర్తు విషయంలో టీడీపీకి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.