వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను జగన్ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిదే. రఘురామపై కాలం చెల్లిన దేశద్రోహం కేసు పెట్టించి లాకప్ లో కొట్టించారన్న ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఇక, తాజాగా రఘురామ నరసాపురం పర్యటనను అడ్డుకోవడానికి జగన్ అండ్ కో విశ్వప్రయత్నాలు చేసి సఫలమైంది. రఘురామపై ఏదో ఒక కేసు పెట్టి అరెస్టు చేయాలని పక్కా స్కెచ్ కూడా రెడీ చేశారు. అయితే, చివరకు తన అభిమానుల కోసం రఘురామ వెనక్కి తగ్గి హైదరాబాద్ లోనే ఉండిపోయారు.
అయినప్పటికీ, జగన్ అండ్ కో అక్కసు తగ్గలేదు. దీంతో తాజాగా రఘురామపై తాజాగా హైదరాబాద్ నగర పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఎంపీ రఘురామపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.
ఈ కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రిలతో పాటు సీఆర్పీఎఫ్ కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లనూ నిందితులుగా చేర్చారు.
అనుమతి లేకుండా తన ఇంటి వద్ద నిఘా పెట్టారని ఏపీ ఇంటెలిజెన్స్కు చెందిన ఓ కానిస్టేబుల్ను రఘురామ అనుచరులు అదుపులోకి తీసుకున్నారని కేసు నమోదైంది. మరి, ఈ వ్యవహారంపై రఘురామ ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.