సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌పై కేసుల సంఖ్య 18కి చేరాయి. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా ఈడీ జగన్ పై అభియోగ పత్రంపై నమోదు చేసింది. ఇటీవలే న్యాయస్థానం ఇటీవల విచారణ ప్రారంభించింది.
ఇందులో జగన్ తో పాటు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ఇందులో విజయసాయిరెడ్డి పేరు తొలగించారు.
ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దలకు దగ్గరై చేసిన లాబీయింగ్ వల్ల ఇలా జరిగిందా? అప్రూవర్ గా మారతారా ? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సాయిరెడ్డి – జగన్ విషయంలో ఇది జరగడం అసంభవం, అవన్నీ పుకార్లు అని వైసీపీ అనుకూలురు కొట్టి పారేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే 11 సీబీఐ, 6 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జ్షీట్నూ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీంతో మొత్తం కేసులు 18 అయ్యాయి. గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో అక్రమాలకు సంబంధించి ఈడీ గత ఏడాదిలోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ.. కొన్ని లోపాల వల్ల న్యాయస్థానం దానిని రిజెక్ట్ చేసింది. మార్చిలో మళ్లీ దాఖలు చేయగా విచారణ చేపట్టింది.
కేసులో ఎవరెవరున్నారు?
సీఎం జగన్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,వైకాపా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్,ఇందూ గ్రూప్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి,బెంగళూరు స్థిరాస్తి వ్యాపారి జితేంద్రవీర్వానీ,ఇందూ ప్రాజెక్ట్స్,సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్,ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్, ఇందూ రాయల్ హోమ్స్, వసంత ప్రాజెక్ట్స్,ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ సంస్థలను ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది. విజయసాయిరెడ్డి ఇందులో లేకపోవడం ఆశ్చర్యకరం. జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియా, ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతి పేర్లు కూడా లేవు.
ఏమిటీ కేసు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీ హౌసింగ్ బోర్డు గృహనిర్మాణ ప్రాజెక్టుల సందర్భంగా.. ఇందూ గ్రూప్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డికి అప్పటి సర్కారు అనుచిత ప్రయోజనాలు కల్పించినట్లు సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి 70 కోట్ల రూపాయలను జగన్ కంపెనీల్లోకి మళ్లించగా… ప్రతిఫలంగా వైఎస్ సర్కారు తక్కువ ధరలకే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 65, గచ్చిబౌలిలో 21, బండ్లగూడలో 50, నంద్యాలలో 75 ఎకరాల చొప్పున కేటాయించినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
బెంగళూరుకు చెందిన ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ అధినేత జితేంద్రవీర్వానీ ఈ ప్రక్రియలో సహకరించడం ద్వారా… 50 కోట్ల 16 లక్షల రూపాయల అక్రమ లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించింది.విచారణ జూన్ 30కి వాయిదా.. ప్రస్తుతం తితిదే ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తన సహచరుడు, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌కు ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించినట్లు ఈడీ దర్యాప్తులో తెలిపింది.
వైవీ సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్ కలిపి గచ్చిబౌలి ప్రాజెక్టులో నాలుగున్నర ఎకరాల వాటాను శ్యాంప్రసాద్ రెడ్డికి ఇచ్చినట్లు సీబీఐ కూడా తన ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. ఏపీహెచ్‌బీకి నష్టం కలిగించి అక్రమ లబ్ధి పొందిన నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టును ఈడీ కోరింది.
ఛార్జ్‌షీట్‌పై విచారణను జూన్ 30కి కోర్టు వాయిదా వేసింది. 117 కోట్ల 74 లక్షల రూపాయల ఆస్తులను 2018 జనవరిలో తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందూ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి అభివృద్ధి చేయని భూములు సహా వసంత ప్రాజెక్ట్స్, ఎంబసీ ప్రాపర్టీస్‌కు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది.