కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై, ఎంపీ విజయసాయిరెడ్డిపై, వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న అయ్యన్నపై ప్రభుత్వం అక్కసు సాధిస్తూనే ఉంది. ఏదో ఒక కేసులో ఇరికించి అయ్యన్నను ఇరుకున పెట్టాలని చూస్తోంది. అయినా సరే తగ్గేదేలే అన్న రీతిలో అయ్యన్న మాత్రం తన విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై దౌర్జన్యం చేశారన్న అభియోగాలపై సెక్సన్ 304, 305, 188, 204ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనకాపల్లిలోని ఓ జాతర సందర్భంగా సమయం మించి పోతుందని పోలీసులు సూచించడంతో ఎస్సైను అయ్యన్నపాత్రుడు తోయడంతో పాటు పరుషంగా మాట్లాడారన్న అభియోగాలు నమోదయ్యాయి.
2 రోజుల క్రితం నర్సీపట్నం గ్రామదేవత ఉత్సవాల్లో కొందరు యువకులు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే, సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటల తర్వాత జరపడానికి వీల్లేదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఆంక్షలు విధించడంపై యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యువకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆ తర్వాత కూడా యువకులు వెనక్కి తగ్గకుండా జాతరలో సెల్ ఫోన్ లైట్ల వెలుగులోనే నృత్యాలు చేసి బాణసంచా కాల్చారు.
జాతర సందర్భంగా విధించిన ఆంక్షలపై టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ గొడవ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ తాజాగా ఆయనపై కేసు నమోదు చేశారు. అయ్యన్నపై కక్ష సాధించేందుకే ఇలా కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.