ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఎస్ 3 జోన్లో పేదలందరికీ ఇళ్లు పథకానికి 268 ఎకరాలను కేటాయి స్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆర్5 జోన్లో కేటాయించిన 1134 ఎకరాలకు అద నంగా 268 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో లబ్ధిదారుల సంఖ్య మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు రాసిన లేఖ మేరకు అదనపు భూమి కేటాయింపునకు సీఆర్ డీఏ ప్రతిపాదన చేసింది.
సీఆర్ డీఏ సిఫారసు మేరకు అనంతవరం, నెక్కల్లు, పిచ్చుకల పాలెం, బోరుపాలెం గ్రామాల్లో 268 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా సుమారు 50వేల మందికి.. రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ, రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ.. మందడం, ఐనవోలు, నవులూరు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు పరిధిలో ఆర్5 జోన్ పేరుతో కొత్త రెసిడెన్షియల్ జోన్ ఏర్పాటు చేసింది. ఇళ్ల స్థలాల కోసం గుంటూరు జిల్లాకు 550 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాకు 584 ఎకరాలు కలిపి మొత్తంగా 11వందల 34 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది.
ఇటీవలే లే అవుట్లను సిద్ధం చేస్తుండగా.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్ల విజ్ఞప్తితో మరో 268 ఎకరాలు కేటాయించాలని కమిటీని నిర్ణయించింది. అయితే.. ఇప్పటికే దీనిపై రైతులు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టులో రైతులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా.. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఇళ్ల కేటాయింపు ఉంటుందని హైకోర్టు తెలిపింది. అయినా.. సర్కారు దూకుడు ఏమాత్రం ఆగడం లేదు.