వివాదాస్పద వ్యాఖ్యలు.. చేతలతో తరచూ వార్తల్లోకి వస్తున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు..ఇటీవల కాలంలో తనపై వస్తున్న విమర్శలు.. ఆరోపణలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. బూతులు చాలా కామన్ గా మాట్లాడతారట ఆయన. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భారీ సవాలు విసిరారు. వివరాలు చూద్దాం.
తన వాహనానికి అడ్డుగా నిలబడి.. గ్రామసమస్యల్ని ప్రశ్నించారన్న కోపంతో వెంగయ్య అనే జనసేన కార్యకర్తను.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు దారుణంగా దూషించటం.. అనంతరం బెదిరించటంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నా తీరుపై జనసేన అధినేత తీవ్రంగా స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తమ కారణంగానే రాజకీయాల్లోకి వచ్చి.. ఈ రోజున తమ పార్టీకి చెందిన వారిని చంపుతానంటే ఊరుకోమని పవన్ హెచ్చరించటం.. మరోసారి అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతారో తాను చూస్తానని ఆయన వ్యాఖ్యానించటం తెలిసిందే. దీనిపై అన్నా రాంబాబు ఘాటుగా రియాక్టు అయ్యారు.
తనపై వెల్లువెత్తుతున్న ఆరోపణలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు అన్నా రాంబాబు. గ్రామీణ ప్రాంతంలో సహజంగా మాట్లాడే భాషను మాట్లాడితే దాన్నే హైలెట్ చేశారంటూ.. తాను మాట్లాడిన పచ్చి బూతుల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. వెంగయ్యతో తనకు వివాదమే లేదని.. తాను మాట్లాడింది చందు అనే యువకుడితో నని స్పష్టం చేశారు. వ్యక్తిగత విషయాలతో వెంగయ్య చనిపోతే.. తనకు ఆపాదిస్తున్నారని మండి పడిన ఆయన.. జనసేన నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు.
చనిపోయిన వెంగయ్య గత చరిత్ర చూస్తే.. నాటు బాంబులతో తిరిగిన వ్యక్తి అని.. అలాంటి వ్యక్తిపై తమ నాయకులు దౌర్జన్యం చేయగలరా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత కారణాలతో వెంగయ్య చనిపోతే.. తనను తప్పు పడుతున్నారన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీతో గెలుపొందానని.. అలాంటి తనకు పవన్ కల్యాణ్ హెచ్చరికలు జారీ చేయటమా? అని ప్రశ్నించారు. తాను ప్రజారాజ్యం తరఫున తొలిసారి గెలిచిన మాట వాస్తవమే అని.. ఆ విషయాన్ని ఇప్పటికి తాను గర్వంగా చెప్పుకుంటానన్నారు.
చిరంజీవి వల్లే తాను తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసిన అన్నా రాంబాబు.. అదే తన విశ్వాసం.. నిబద్ధత అని వ్యాఖ్యానించారు. ఒక్క సీటు గెలిస్తేనే పవన్ కల్యాణ్ ఇంత ఆరాచకంగా మాట్లాడుతున్నారని.. అందుకే ప్రజలు ఆ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారన్నారు. వెంగయ్య ఆత్మహత్యలో తనకు సంబంధం ఉంటే తాను పోలీసుల ఎదుట లొంగిపోతానన్న ఆయన.. పవన్ కు నచ్చిన వారితో విచారించుకోవాలన్నారు. పవన్ పై పోటీకి తాను సిద్ధమని.. ఆయన అందుకు ఓకేనా? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో పవన్ గెలిస్తే.. ఎలాంటి విచారణ లేకుండా న్యాయస్థానం విధించే ఏ శిక్షకు అయినా సిద్ధమని.. ఒకవేళ ఎన్నికల్లో పవన్ ఓడితే.. జనసేనను మూసేయగలరా? అని ప్రశ్నించారు. తన సవాలుకు స్పందిస్తే.. తాను రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. సవాలుకు సిద్ధమైతే.. ఆ విషయాన్ని సోమవారం ప్రకటించాలంటూ అల్టిమేటం విధించారు. మరి.. అన్నా రాంబాబు సవాలుకు పవన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.