ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి ఉద్యమకారుడు అన్నా హజారే గురించి భారత దేశ ప్రజలకు పరిచయం అక్కర లేదు. లోక్ పాల్ బిల్లు, అవినీతి వ్యతిరేక చట్టాల కోసం అన్నా హజారే కొన్నేళ్ల క్రితం చేసిన పోరాటంలో నేటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నా హజారే ఇమేజ్ ను వాడుకున్న కేజ్రీవాల్ ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా రాజకీయ పార్టీ పెట్టి సీఎం అయ్యారు.
పార్టీ పెట్టకూడదని, రాజకీయాలకు దూరంగా ఉంటూనే ప్రజా సమస్యలపై పోరాడాలన్న అన్నా హజారే స్ఫూర్తికి కేజ్రీవాల్ తూట్లు పొడిచారని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. ఇక, సీఎం అయిన తర్వాత కేజ్రీ తీరు మారిందని, ఉద్యమ సిద్ధాంతాలకు, అవినీతిపై పోరుకు రాసిన స్వరాజ్ పుస్తకంలోని నియమాలకు విరుద్ధంగా కేజ్రీ ప్రవర్తిస్తున్నారని విమర్శలు కూడా వచ్చాయి. అలా చేయబట్టే కేజ్రీ సర్కార్ ను లిక్కర్ పాలసీ వ్యవహారం కుదిపేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ పై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆప్ కూడా అన్ని పార్టీలలో ఒకటిగా మారిపోయిందని, అధికారం నిషా ఎక్కిందని అన్నా హజారే విమర్శలు గుప్పించారు. ఆనాడు అవినీతి వ్యతిరేక పోరాటంలో కేజ్రీవాల్ చెప్పిన ఆదర్శాలను నేడు గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఈ ప్రకారం కేజ్రీవాల్ కు ఆయన రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కేజ్రీవాల్ ఆప్ పెట్టిన తర్వాత ఆయనపై అన్నా హజారే విమర్శలు గుప్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
‘‘మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారిగా లేఖ రాస్తున్నాను. ఎందుకంటే.. మీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన లిక్కర్ పాలసీ విషయంలో వచ్చిన వార్తలు నన్ను భాధించాయి. నాడు అవినీతి వ్యతిరేక పోరాటంలో రాసిన ‘స్వరాజ్’ పుస్తకంలో ఎక్కడైనా స్థానికుల అనుమతి లేకుండా లిక్కర్ దుకాణాలు పెట్టవద్దని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక అవన్నీ మర్చిపోయినట్టున్నారు. లిక్కర్ లాగే అధికారం కూడా నిషా ఇస్తుంది. మీకు ఆ అధికారం నిషా తలకు ఎక్కినట్టు కనిపిస్తోంది. మీరు స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మిగతా అన్ని పార్టీల్లాగే మారిపోయింది.
ఇలాంటి తప్పుడు మద్యం పాలసీ దేశంలో ఎక్కడా కూడా రావాల్సినది కాదు. అలాంటి దానిపై అవగాహన కల్పించాల్సిన విషయాన్ని పక్కన పెట్టేశారు. బలమైన లోక్ పాల్, అవినీతి వ్యతిరేక చట్టాలను పక్కన పెట్టారు. వీటికి బదులు ప్రజా వ్యతిరేకమైన.. ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకమైన మద్యం పాలసీని తెచ్చారు. ఢిల్లీలో ప్రతి మూలమూలనా మద్యం దుకాణాలను తెరిచారు. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే విష వలయంలో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ఉద్యమం నుంచి ఎదిగిన పార్టీకి ఇది సరికాదు…” అని హజారే ఆవేదన వ్యక్తం చేశారు.