నేను ఏపీని! రెండేళ్ల కిందటి వరకు నేనంటే.. దేశంలోనే పెద్ద గుర్తింపు. ఒక్కదేశమన్న మాటే కాదు.. ప్రపంచంలోనూ నా గురించి చర్చించుకునే వారు. సుదీర్ఘ సముద్ర తీరంతోపాటు.. వనరులు పుష్కలంగా ఉన్న నేనంటే.. అభివృద్ధికి మారుపేరుగా మారానని.. ప్రతి ఒక్కరూ అక్కున చేర్చుకున్నారు. నన్ను పాలించిన నేత `విజన్` కూడా తోడై.. నా పేరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వినిపించింది. ఏడాది పొడవునా పండగలు.. ఆదివారాలు ఆటవిడుపులు.. వచ్చి పోయే విదేశీ పెట్టుబడి దారులు ఇలా.. రాష్ట్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేదంటే.. నన్ను నేనే నమ్మలేక పోతున్నా.
కొన్ని `మార్పు`లు ఇంతగా బాధిస్తాయని అనుకోలేం. ఒకప్పుడు.. అది కూడా గత ఐదేళ్లలో జూన్ మాసం వచ్చిందంటే.. చాలు.. రాష్ట్రంలో అనేక పండగలు జరిగేవి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలతో మమేకమై.. అనేక పండగలు చేస్తూ.. నా పేరును జాతీయస్థాయిలో నిలిచేలా చేశారు. ఒక్క జూన్‌లోనే యోగా దినోత్సవం వస్తుంది. జూన్ 21న జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించే యోగా డేను తొలిసారి చంద్రబాబు నా ఇంట(ఏపీ) ప్రవేశ పెట్టి ఘనంగా నిర్వహించారు. అది ఆయనకే చెల్లింది. అనేక మంది యోగా గురువులను రాజధానికి రప్పించి.. ప్రజలను చైతన్య పరిచారు. మరి ఇప్పుడో? ప్చ్! పెదవులు విరుచుకోవడమే!
ఇక, జూన్ 23 వస్తే.. చాలు ప్రపంచ ఒలింపిక్ డేను అప్పటి సీఎం చంద్రబాబు ఎంతో ఘనంగా నిర్వహించేవారు. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి పలు ప్రాంతాల్లో.. సెలబ్రిటీలను పోగు చేసి.. ఒలింపిక్ డే సందర్భంగా పరుగు నిర్వహించి.. నా కీర్తిని రెపరెప లాడించేవారు. మరి ఇప్పుడు.. ఏదీ ఆ సంబరం అని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పేవారు కూడా లేరు. అంతేనా.. అన్నదాతకు కీలకమైన ఏరువాక పౌర్ణమిని గత బాబు పాలనలో ఏటా ఘనంగా నిర్వహించేవారు. ప్రజా ప్రతినిధులు నాగళ్లు చేతపట్టి దుక్కిదున్ని.. తొలి విత్తు నాటేవారు. మరి ఇప్పుడు.. అసలు దీని ఊసు ఎత్తేవారు కనిపించడం లేదు.
ఆదివారాలు వస్తే.. చాలు.. నేనెంతో పులకించిపోయేదాన్ని. ఎందుకంటే.. గత ప్రభుత్వంలో పొద్దు పొద్దున్నే ప్రధాన రోడ్లన్నీ.. రంగ వల్లులతో తీర్చి దిద్ది.. పిల్లపాపలను ఒకచోటకు చేర్చి.. ఆటపాటలు నిర్వహించి.. పోటీలు పెట్టి.. బహుమతులు పంచి.. అబ్బో.. ఆ సందడే సండేకు మజా తెచ్చేది. మరి ఇప్పుడు ఎక్కడైనా ఆ సండే సందడి ఉందా?! .. ఏం చెప్పను.. ఇదీ నా పరిస్థితి!! నా డైరీలో ఓ చిన్న పేజీ.. ఇలా చెప్పుకొంటూ.. పోతే.. కడుపు చెరువవుద్ది! అందుకే.. `బాబు లేని నేను` ఇలా మిగిలాను!! సందడి లేదు.. సంతృప్తి లేదు.. సంతోషం అంతకన్నా లేదు!!