అప్పు-తప్పు-ముప్పు! అంటారు పెద్దలు. కానీ, అదేంటో అప్పు చేయందే ఇల్లు గడవని పరిస్థితి చాలా మం ది కుటుంబాల్లో గమనిస్తూ ఉంటాం. అయితే, ఇప్పుడు దీనికి భిన్నంగా అప్పు చేయందేపాలన చేయలేమ ని జగన్ సర్కారు నిర్ద్వంద్వంగా చెప్పుకొస్తోంది. దీనికి కావాల్సిన జీవోలను కూడా జారీ చేసేస్తోంది. అప్పు చేస్తేనే తప్ప. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని దయనీయ స్థితికి ఏపీ చేరిపోయిందనేది వాస్తవం . ఈ మాట ఎవరో.. చెబితే.. ఏదో జగన్ అంటే ఇష్టం లేక అంటున్నారంటూ.. ముఖం చిట్లించేయొచ్చు. కానీ, కేంద్రంలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే స్వయం ప్రతిపత్తి సంస్థ చెప్పుకొచ్చింది.
జగన్ అధికారంలోకి వచ్చి.. ఏడాదిన్నర అయిపోయింది. తొలి ఏడాది మాట పక్కన పెడితే.. గడిచిన ఆరు మాసాల కాలంలో అంటే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు(తొలి అర్ధ ఆర్థిక సంవత్సరం) చూసుకుంటే.. ఏపీ ప్రభుత్వం తెచ్చిన మొత్తం మొత్తం రూ.55వేల కోట్లు. అంటే, రెండో ఏడాది ప్రారంభంలోనే తొలి ఆరు నెలలకే ఇంత అప్పు తెచ్చారంటే ఏడాదికి సుమారుగా లక్షా పదివేల కోట్ల అప్పు తెచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందన్నది ఆర్థిక నిపుణుల మాట. ఇక, ఈ అప్పులు కూడా ఎలా ఉన్నాయంటే.. బడ్జెట్ అంచనాలకు మించి ఇప్పటికే 114% అప్పు తేవడం.
నిజానికి తలసరి ఆదాయం బ్రహ్మాండంగా ఉన్న హైదరాబాద్ వంటి నగరాలున్న తెలంగాణ కూడా ఈ రేంజ్లో అప్పులు చేయడం లేదు. పోనీ.. ఇంతా చేస్తే.. అప్పు తెచ్చారు సరే! దీని వల్ల ఏదైనా స్థిరాభి వృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? అంటే.. అది ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అంతేకాదు.. తెచ్చిన మొత్తాలను తెచ్చినట్టు.. ప్రజలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల పేరుతో బదలాయించేస్తున్నారు. దీనివల్ల ఖర్చు కనిపిస్తోందే తప్ప.. ఉత్పత్తి, ఆదాయం వంటి వి ఎక్కడా కనిపించడం లేదనేది నిపుణుల ఆవేదన.
అంతేకాదు, ఇలా ఎన్నాళ్లు జరుగుతుంది. ఆదాయం పెంచుకునే మార్గాలు లేకుండా కేవలం పప్పు బెల్లాలు పంచుకుంటూ. పోతే.. రేపు రాష్ట్రం చిప్పపట్టుకునే పరిస్థితికి చేరుకోవడం ఖాయమని అంటున్నారు. ఇంతగా అప్పులు చేసిన పప్పు కూడా తినాలా? అనేది వారి మాట. మరి జగన్ ఏం ఆలోచిస్తున్నారో.. రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్తారో చూడాలి.