కరోనా సంక్షోభం, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీకి జగన్ అప్పులు మిగులుస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
తలకు మించిన అప్పులు…దాని తాలూకా వడ్డీలు వెరసి పన్నుల రూపంలో జగన్ ప్రజల నడ్డి విరుస్తున్నారని దుయ్యబడుతున్నారు. దీనికితోడు, ఇప్పటికే ప్రజలపై `పన్ను` పోటుతో జగన్ దాదాపు 15 వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఖజానా నింపుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీని జగన్ అప్పుల ఊబిలో దించుతున్నారని కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) సంచలన విషయాలు వెల్లడించింది.
జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పుగా తీసుకొచ్చినవేనని కాగ్ తేల్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇంకా సగం కూడా పూర్తికాకుండానే ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు మొత్తాన్ని తీసుకుందని షాకింగ్ నిజాలు వెల్లడించింది.
గత ఐదు నెలల్లో వివిధ రూపాల్లో రూ. 84,617.23 కోట్లను ఏపీ సర్కార్ సమీకరించిందని, అందులో రూ. 47,130.90 కోట్ల అప్పు ఉందని కాగ్ తెలిపింది. సమీకరించిన మొత్తం నిధుల్లో 55.7 శాతం అప్పేనని వెల్లడించింది. సెక్యూరిటీల వేలం, ఇతర అప్పుల రూపంలో ఈ ఏడాది రూ. 48,295.58 కోట్లు అప్పు తీసుకోనున్నట్టు బడ్జెట్ అంచనాలలో ఏపీ సర్కార్ పేర్కొందని, కానీ, ఆగస్టు నాటికే ఆ అప్పు మొత్తాన్ని తీసుకుందని కాగ్ తెలిపింది.
కరోనా విపత్తు, లాక్ డౌన్ వల్ల ఖజానాకు భారీగా పడిపోయిన ఆదాయం వంటి కారణాల వల్ల ఈ అప్పు తీసుకొని ఉండవచ్చని కాగ్ అభిప్రాయపడింది. ఏది ఏమైనా ఏపీలో సీఎం జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పేనని కాగ్ తేల్చింది.
ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు రకరకాల పన్నుల పెంపు ద్వారా జగన్ సర్కార్ దాదాపు రూ.15 వేల కోట్లు రాబట్టిందని ప్రచారం జరుగుతోంది. మే మొదటివారంలో 75 శాతం మద్యం ధరలు పెంపు ద్వారా రూ.13500 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది.
జూన్ లో పెట్రో్ల్, డీజిల్ రేట్ల పెంపుతో రూ.600 కోట్లు, ఆగస్టులో భూముల ధరల పెంపుతో రూ.800 కోట్లు, వృత్తి పన్ను పెంపుతో రూ.161 కోట్లు రాబట్టింది ఏపీ సర్కార్. న్యారురల్ గ్యాస్ పై వ్యాట్ 10 శాతం పెంచడం ద్వారా రూ.300 కోట్ల అదనపు ఆదాయం రాబట్టేందుకు సిద్ధమైంది. పన్నుల రూపంలోనే మరో 3 వేల కోట్ల రూపాయలు ఆదాయం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు వీటికి అదనమని, త్వరలోనే రవాణాశాఖలో పన్నులు పెంచాలనే యోచనలోనూ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖలో పన్నుల పెంపు ద్వారా సుమారు రూ. 400 కోట్లు, గ్రీన్ ట్యాక్స్ పెంపు ద్వారా అదనంగా రూ.30 కోట్లు అదనపు ఆదాయం రాబట్టాలని జగన్ సర్కార్ యోచిస్తోందట.
భవిష్యత్తులో ఈ తరహాలోనే మరో 3 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేసి ఖజానా నింపేందుకు జగన్ సైలెంట్ బాదుడు కార్యక్రమాలు మరిన్ని చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.
ఏఫీలో ప్రజలకు అప్పు చేసి పప్పుకూడు పెడుతున్న జగన్ …ఆర్థిక సంవత్సరం సగం పూర్తికాకుండానే దాదాపు 50 వేల కోట్లు అప్పు చేసిందని, ఇదే ఫ్లోలో వెళితే 2021 మార్చి నాటికి ఏపీ అప్పు లక్ష కోట్లకు చేరుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదన్న వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఏపీలో జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పేనని….వచ్చే ఏడాది మార్చినాటికి జగన్ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి అప్పే అయినా ఆశ్చర్యపోనవరసర లేదని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇలా గొప్పలకు పోయి అప్పు చేసి పప్పుకూడు పెట్టడం….ఆ తర్వాత ప్రజలపై చాపకింద నీరులా పన్నులు విధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.