రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటం.. ఆ సందర్భంగా షరతులు విధించటం తెలిసిందే. నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ బెయిల్ విషయంలో మీడియాలో జరిగిన చర్చ.. ఆ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మేధావిగా పేరున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు.. ఆ సందర్భంగా ఆంధ్రజ్యోతి మీడియా సంస్థపై ఆయన చేసిన కామెంట్లపై ఆ సంస్థ ఎండీ ఆర్కే తాజాగా తన కాలమ్ లో స్పందించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఎప్పుడూ లేని రీతిలో ఘాటుగా రియాక్టు కావటమే కాదు.. ఆయన మాటలకు భారీ కౌంటర్ ఇవ్వటం గమనార్హం. అదేసమయంలో.. సూటి సవాలు విసిరి విషయం మరోస్థాయికి వెళ్లేలా చేశారు. ఇంతకీ ఆర్కే ఏమన్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ధీటుగా ఇచ్చిన కౌంటర్ లో ఏముందన్న విషయాన్ని ఆయన అక్షరాల్లోనే చూస్తే..
‘‘బెయిలు దరఖాస్తుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ట్రయల్ కోర్టుకే వదిలేయాలని ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించడమే కాకుండా రఘుకు బెయిలు మంజూరు చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ వాదన వీగిపోయినట్టే కదా! ఈ వాస్తవాలను మరుగుపరచడానికి ప్రయత్నించే వారితో ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు కూడా శ్రుతి కలపడం ఆశ్చర్యంగా ఉంది. రఘుపై నమోదు చేసిన రాజద్రోహం కేసులో ‘ఏబీఎన్ చానల్’తో పాటు మరో చానల్‌ను కూడా సహ కుట్రదారులుగా చేర్చడంపై స్పందిస్తూ, ఆ రెండు చానల్స్ తెలుగుదేశం పార్టీ అనుకూల చానల్స్ అని నాగేశ్వర్ చెప్పుకొచ్చారు’’
‘‘మేం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధానాలను విమర్శిస్తున్న మాట వాస్తవం. ఆయన ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నందునే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జగన్ రెడ్డి తప్పులను ఎత్తి చూపితే తెలుగుదేశం అనుకూలత అని ప్రొఫెసర్ నాగేశ్వర్ భావిస్తే మేం చేయగలిగింది ఏమీ లేదు. అలా అయితే సీపీఎం సానుభూతిపరుడైన నాగేశ్వర్ తటస్థవాది ఎలా అవుతారు? ఆయన మమ్మల్ని నిందించినట్టుగా మేం ఆయనను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పక్షపాతి అంటే అంగీకరిస్తారా? ఆయన అంగీకరిస్తే మేం కూడా అంగీకరిస్తాం’’
‘‘జగన్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారానికి మేధావులం అని చెప్పుకునే కొంతమంది వంతపాడడం వల్లనే ప్రజలు పక్కదారి పడుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపితే గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్రయత్నం చేసింది జగన్ అండ్ కో కాదా? రఘురామరాజు విషయమే తీసుకుందాం, సీఐడీ పోలీసులు తనను హింసించారని సీఐడీ కోర్టుకు ఆయన ఫిర్యాదు చేసిన సందర్భంగా ఆయన కమిలిన పాదాల ఫొటోలు విడుదలయ్యాయి. వాటిని చూసిన వారెవరికైనా లాఠీలతో ఆయన అరికాళ్లపై కొట్టారనే అనిపిస్తుంది’’
‘‘అయితే జగన్ అండ్ కో చేసిన ప్రచారం ఏమిటి? రఘుకు సొరియాసిస్ వ్యాధి ఉందని, గోక్కోవడం వల్ల అరికాళ్లు అలా కనిపిస్తున్నాయని ప్రచారం చేశారు. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆయనకు అయిన గాయాలు, కొట్టడం వల్ల అని చెప్పలేమని పేర్కొనడంతో.. ‘‘చూశారా! పోలీసులు ఆయనను కొట్టలేదు!’’ అంటూ ప్రచారం చేశారు.
ఆర్మీ ఆసుపత్రి నివేదికలో రఘు కాళ్లు వాచి ఉన్నాయని పేర్కొనడంతో ఆయనకు ఎడిమా వ్యాధి ఉందని ప్రచారం మొదలుపెట్టారు. ఎడిమా అనేది ఒక వ్యాధి కాదని ఈ అజ్ఞానులకు ఎవరు చెప్పాలి? వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో కాళ్ల చీలమండల దగ్గర నీరు చేరుతుంది. దానినే ఎడిమా అంటారు.
సుప్రీంకోర్టులో వాదన సందర్భంగా రఘు తన కాళ్లను తానే గాయపరుచుకున్నారేమోనని సరికొత్త వాదన చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు అనుచితంగా ప్రవర్తించడం వల్లనే రఘుకు గాయాలయ్యాయని ఆర్మీ ఆసుపత్రి నివేదిక ప్రకారం ప్రాథమికంగా అంచనాకు వచ్చామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆటలు సాగలేదు’’