ఏపీలో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండు రోజులే సమయం ఉంది. ఈ రోజే ప్రచారానికి చివరి రోజు. దీంతో ఎవరి స్థాయిలో వాళ్లు ప్రచారాస్త్రాలను పదునెక్కించారు. ప్రచారం చివరి రోజు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాక్షి మినహా అన్ని ప్రధాన పత్రికల్లో ఫస్ట్ పేజ్ యాడ్‌తో జనాలకు వైసీపీని ఓడించాలనే పిలుపునిచ్చింది టీడీపీ.
గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అన్యాయాలకు సంబంధించిన వార్తా కథనాలకు సంబంధించిన క్లిప్పింగ్స్నే ఈ యాడ్ కోసం ఉపయోగించుుకంది టీడీపీ. మద్యపాన నిషేధ హామీని తుంగలో తొక్కి మద్యం అమ్మకాలను ఎలా పెంచేశారో చూపించే ఓ కథనం.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో చెప్పే మరో కథనం.. నిరుద్యోగంలో నం.1.. తాకట్టులో సచివాలయం.. ఆర్టీసీ ఛార్జీల మోత.. టెన్త్ కుర్రాడిని తగలబెట్టేశారు.. దళిత విద్యార్థిని దారుణ హత్య.. చెలరేగిపోతున్న ఇసుక మాఫియా.. పోలీసుల ఒత్తిడితో కుటుంబం ఆత్మహత్య.. యువతిపై సామూహిక అత్యాచారం.. డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి.. ఇలా మీడియాలో వచ్చిన వైసీపీ వ్యతిరేక వార్తలకు సంబంధించిన క్లిప్సింగ్నే పేర్చి.. ‘‘అన్నీ గుర్తు పెట్టుకో ఇప్పుడు నీ టైం వచ్చింది’’ అంటూ ఓటు వేసే జనాన్ని జాగృతం చేసింది టీడీపీ ఈ యాడ్‌లో.
ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలే ఉన్నాయి. దీంతో ఈనాడులో జ్యోతి వార్త.. జ్యోతిలో ఈనాడు వార్తలు చూసే అవకాశం దక్కింది జనాలకు. ఓటు వేయండి, కూటమిని గెలిపించండి అంటూ రొటీన్‌గా పిలుపునివ్వకుండా.. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అరాచకాలకు సంబంధించిన న్యూస్ క్లిప్స్‌తో జనాల్లో ఒక ఆలోచన రేకెత్తించేలా ప్రచారం చివరి రోజు టీడీపీ భలే యాడ్ రూపొందించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.