2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత జగన్…ప్రతి స్పీచ్ లోనూ ఓ రేంజ్ లో సినిమా డైలాగుల తరహాలో హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాను సీఎం అయ్యాక…కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడనని….అర్హులైన వారందరికీ పథకాలు, ప్రభుత్వ ఫలాలు అందిస్తానని అరచేతిలో వైకుంఠం చూపించారని జగన్ సీఎం అయిన కొద్ది రోజులకే విమర్శలు వచ్చాయి. సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన రెండు నెలల్లోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతీకార దాడులు పెరిగిపోయాయని, ఏపీలో పులివెందుల పంచాయతీలు మొదలయ్యాయని టీడీపీ నేతలు విమర్శించారు.
టీడీపీకి ఓటు వేసిన పాపానికి కొందరు టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లకుండా గోడలు అడ్డుకట్టిన ఘనత వైసీపీ నేతలదేనని విమర్శలు వచ్చాయి. ఇక, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చారన్న కారణంతో టీడీపీ కార్యకర్తలు ఇళ్ల ప్రహరీ గోడలు కూల్చివేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. అయినప్పటికీ, ఏపీలో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. అయినా కూడా ఏపీ పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లా, పెద్దకడుబూరు మండలం, బసలదొడ్డిలో టీడీపీ సానుభూతిపరులకు తాగునీరు నిలిపివేసిన ఘటన సంచలనం రేపింది. టీడీపీకి ఓట్లు వేశారన్న ఉద్దేశంతో కటిక కాలనీకి నీళ్ల సరఫరాను అధికార పార్టీ నాయకులు నిలిపివేశారు. దీంతో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది హేయమైన చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కులం, మతం చూడమని చెప్పిన జగన్ ఇతర పార్టీల వాళ్లకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్న దుయ్యబట్టారు. టీడీపీకి ఓట్లు వేశారని నీళ్లు, ఫించన్, రేషన్ ఆపి వేయడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు.
కరోనా కట్టడి, పాలన గాలికొదిలి టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ జగన్ రాక్షసానందం పొందుతున్నారని అచ్చెన్న విమర్శించారు. రెండేళ్ల పాలనలో దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, కక్ష్య సాధింపు చర్యలు తప్ప ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటని అచ్చెన్న నిలదీశారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని జగన్…అక్రమ కేసులు, అరాచకాలతో అక్రమ అరెస్టుల ఆంద్రప్రదేశ్గా మార్చారని ఆరోపించారు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్లే వ్యాలీడిటి అని, టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్, వైసీపీ నేతలు ప్రతి రోజూ పశ్చాత్తాపపడక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.