ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడివడి ఏడేళ్లు దాటిపోయినప్పటికీ ఇప్పటికీ విభజన సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయా అంశాలపై అడపాదడపా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా కేంద్రం తీపికబురు వినిపించింది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను తొలిగించేందుకు త్రిసభ్య కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితోపాటు ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన కేంద్రం ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 17 న కమిటీ తొలి సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించేందుకే త్రి సభ్య కమిటీ అంటూ పేర్కొన్న హోంశాఖ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చడం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చతోపాటు ఏపీఎస్ఎఫ్సీ విభజన, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యలు, పన్నుల వ్యవహారం, వనరుల వ్యత్యాసాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌పై త్రి సభ్య కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. తొలి సమావేశంలో చర్చించే అంశాల ఆధారంగా ఈ కమిటీ కార్యాచరణ, తదుపరి పరిణామాలపై స్పష్టత రానుంది.
కాగా, ఇప్పటివరకు కేంద్రం దృష్టికి ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు విభజన సమస్యలను తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈ మేరకు ప్రత్యేకంగా ఇరు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సంధిస్తున్నారు. మరోవైపు వివిధ మంత్రిత్వ శాఖల వద్ద విభజన సమస్యలను ప్రస్తావిస్తూ వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఇలాంటి సమస్యలకు తాజాగా ఏర్పాటు చేసిన కమిటీ పరిష్కారం చూపగలదని భావిస్తున్నారు.