గడిచిన కొద్దిరోజులుగా క్రష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ ఈ మందు గురించి గంటల కొద్దీ మాటలు.. వాదనలు సాగుతున్నాయి.
ఇప్పుడంతా రెండు వర్గాలుగా చీలిపోయి.. ఆనందయ్య మందుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఇలాంటివేళ.. ఏపీ ప్రభుత్వం స్పందించటం.. మందు శాస్త్రీయతతో పాటు.. దాన్ని వినియోగిస్తే ఏమైనా సైడ్ ఎఫెక్టులు ఉంటాయా? అన్న విషయంతో పాటు.. ఐసీఎంఆర్ సూచనల్ని కోరటం తెలిసిందే.
ఆనందయ్య మందుపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది.
వారి ఎదుట ఆనందయ్య తాను తయారు చేసే మందును మరోసారి తయారు చేసి చూపించారు.
ఈ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన ఆయూష్ ప్రతినిధులు మందు తయారీలో ఎలాంటి హానికారక పదార్థాలు లేవని తేల్చారు.
అయితే.. దీన్ని ఆయుర్వేదిక్ మందు కంటే కూడా నాటు మందుగానే పరిగణిస్తామని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు.
కళ్లలో వేసే డ్రాప్స్ లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని.. అయితే ఆనందయ్య మందు రోగులపై పని చేస్తుందా? లేదా? అనే విషయాన్ని ఆయుర్వేద వైద్యుల టీం తేలుస్తుందని చెప్పారు.
వైద్యులు టీం పరిశీలన తర్వాత తమ రిపోర్టును సీసీఆర్ఎఎస్ కు పంపుతామని చెప్పారు.
ఆయుష్ విభాగంతో పాటు.. ఆయుర్వేద వైద్యులు.. ఐసీఎంఆర్ ప్రతినిధుల రిపోర్టుల అధ్యయనం తర్వాత వెలువడే సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆనందయ్య మందుపై నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు.